Home guard Losts Life with her son at Anakapalli : అనకాపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల కుమారుడితో కలిసి హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని తుమ్మపాలలో జరిగింది. అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో అట్టా ఝాన్సీ అనే మహిళ హోంగార్డుగా విధులు నిర్వహిస్తోంది. తన భర్త అచ్యుతరావు అలియాస్ విజయ్ రోజూ వేధింపులకు గురిచేస్తుండడంతో.. అది తట్టుకోలేని ఝాన్సీ తీవ్ర మనస్థాపం చెంది తన ఆరేళ్ల కుమారుడు దినేష్ కార్తీక్ కలిసి ఏలేరు కాలువలో పడి చనిపోయింది. ఫిబ్రవరి 7న కశింకోటలోని ఇంటి నుంచి ఆమె కుమారుతో బయటకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు ఈ రోజు ఏలేరు కాలువలో వారిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో విగతజీవులైన తల్లీ, కొడుకును చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం నిందితుడు అచ్యుతరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఇంజినీరింగ్ విద్యార్థినిపై అఘాయిత్యం


మరో ఘటనలో ఇంజినీరింగ్ చదువుతోన్న విద్యార్థినిని ఓ యువకుడు మాయమాటలు చెప్పి, నమ్మించి అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో చోటుచేసుకుంది. విద్యార్థిని పరిటాలలోని వసతి గృహంలో ఉంటూ కంచికచర్లలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమెకు పరిటాలకు చెందిన గాలి సైదాతో పరిచయం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకున్న సైదా.. ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆమెను నగ్నంగా ఫొటోలు తీసి, బెదిరింపులకు పాల్పడ్డాడు. అది చాలదన్నట్టు ఆ ఫొటోలను తన స్నేహితులకూ చూపించాడు. దీంతో వారూ ఆమెను పలు రకాలు బెదిరిస్తూ అనేక ఇబ్బందులకు గురిచేశారు. ఇక ఈ వేధింపులను భరించలేని విద్యార్థిని ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నామని సీఐ చవాన్ తెలిపారు.


ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో


కొన్ని రోజులక్రితం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి గేట్‌ వద్ద ఓ ప్రైవేట్‌ వసతి గృహంలో ఉంటూ సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ వసతి గృహం కింద స్థిరాస్తి ఆఫీస్‌ ఉండగా.. పై అంతస్తులో బాలికల వసతి గృహం ఉంది. చివరి అంతస్తులో ఓ రాత్రి స్థిరాస్తి వ్యాపారులకు సంబంధించి ఒకరి బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. రాత్రి 11 గంటల సమయంలో వేడుకల్లో పాల్గొన్న నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జోన్నాయిచింతకు చెందిన అజిత్‌ (22) అనే యువకుడు వసతి గృహంలో ఒంటరిగా ఉంటోన్న విద్యార్థిని గదిలోకి వెళ్లి అత్యాచారం చేస్తుండగా కేకలు వినిపించాయి. దీంతో విద్యార్థులు తలుపుకు గడియ పెట్టి 100కు ఫోన్‌ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.


Also Read : Murder: మనవడి చేతిలో హత్యకు గురైన పారిశ్రామికవేత్త.. 73సార్లు పొడిచి చంపిన నిందితుడు