Crime News :  ఆటలు ఆడేటప్పుడు క్రీడాస్ఫూర్తి అనేది ఒకటి ఉండాలి. లేకపోతే తొండి ఆట ఆడేస్తారు. అదే కాస్త క్రిమినల్ మనస్థత్వం ఉన్నవారు ... ఆవేశపడిపోయి చంపేసినా చంపేస్తారు. సాధారణంగా ఇలా తోటి ఆటగాళ్లపై దాడులు చేసిన ఘటనలు తరచూ జరుగుతూంటాయి. కానీ ఆ క్రికెట్ మ్యాచ్‌లో మాత్రం అంపైర్ పై దాడి చేశారు. దాడి అని చెప్పడం చిన్న పదం అవుతుంది. హత్య చేసేశారని చెప్పడం కరెక్ట్. ఒడిషాలోని కటక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.  


క్రికెట్ మ్యాచ్‌లో నో బాల్ వివాదం                                                        


ఒడిశాలోని కటక్‌ జిల్లాలో ని చౌద్వార్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మన్హిసలంద గ్రామంలో శనివారం శంకర్‌పూర్‌, బెర్హంపూర్‌కు చెందిన అండర్-18 క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మహిలాంద ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల లక్కీ రౌత్‌, అంపైర్‌గా వ్యవహరించాడు. అయితే మ్యాచ్‌ సందర్భంగా ఒకరు బౌలింగ్‌ చేయగా అంపైర్‌గా ఉన్న లక్కీ రౌత్‌ ‘నో బాల్‌’ సిగ్నల్‌ ఇచ్చాడు. దీంతో ఇది గొడవకు దారి తీసింది. ఇరువులు వాదులాటకు దిగి.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.  అంపైర్‌ లక్కీ రౌత్, ప్లేయర్‌ జగ్‌ రౌత్‌ మధ్య  తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో జగ్‌ రౌత్‌ తన సోదరుడు మునా రౌత్‌ను పిలిపించాడు. 


సోదరుడ్ని పిలిపించి అంపైర్ ను హత్య చేయించిన ప్లేయర్                                              


అక్కడకు వచ్చిన అతడు ఆగ్రహంతో లక్కీ రౌత్‌ను కొట్టాడు.  ‘నో బాల్‌’ సిగ్నల్‌ ఇచ్చిన ఆ అంపైర్‌ను కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన అత‌డు చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లిస్తుండగానే మ‌ర‌ణించాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జ‌గ్ రౌత్, మునా రౌత్ ల‌ను అరెస్ట్ చేశారు. ఈ హత్య ఒడిశాలో సంచలనం సృష్టించింది. చిన్న చిన్న వివాదాలే పెద్దగా మారి చివరికి హత్యలకు దారి తస్తున్నాయని ... అసలు ఈ వివాదంలో చంపుకోవాల్సినంత ఘర్షణ ఏముందన్న  సందేహం నెటిజన్లలో వస్తోంది. 


క్షణికావేశంలో చేసిన నేరాలతో జీవితాల్లో చీకటి                                   


ఉద్దేశపూర్వకంగా చేసే నేరాల కన్నా ఇలా క్షణకావేశంలో చేసే నేరాల వల్లే ఎక్కువగా హత్యల వంటి అతి పెద్ద  క్రైమ్స్ జరుగుతున్నాయని రికార్డులు చెబుతున్నాయి. చిన్న చిన్న వాదోపవాదాలు...  కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని తనం వల్ల.. కొన్ని జీవితాలు అంతమవడంతో పాటు మరికొన్ని జీవితాలు జైలు పాలవుతున్నాయని అంటున్నారు.