Udaipur Tailor Murder Case: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ హత్య కేసు నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మంగళవారం అరెస్ట్ చేసింది. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన మహిళా నేత నుపూర్ శర్మకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడన్న కోపంతో ఇద్దరు వ్యక్తులు ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ సాహూను పట్టపగలే అత్యంత దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఈ సంచలన కేసును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ టీమ్ ఈ కేసుతో సంబంధం ఉన్న హైదరాబాద్ లోని సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది.
టైలర్ కన్హయ్య లాల్ హత్య కేసులో ఎన్ఐఏ ఇదివరకే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసింది. తాజాగా హైదరాబాద్‌లో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. బిహార్ నుంచి వచ్చి నగరంలో ఉంటున్న నిందితుడు లక్కీ హోటల్ సమీపంలో ఓ ఇంట్లో ఉండగా ఎన్ఐఏ టీమ్ ఆ వ్యక్తిని అరెస్ట్ చేసింది. అనంతరం విచారణ నిమిత్తం అధికారులు నిందితుడ్ని రాజస్థాన్‌కు తరలించారు. రియాజ్, గౌస్ అనే ఇద్దరు నిందితులు వారం రోజుల కిందట మంగళవారం నాడు రాజస్థాన్ ఉదయ్‌పూర్‌కు చెందిన దర్జీ కన్హయ్య లాల్‌ను కత్తులతో నరికి హత్య చేశారు.
అసలేం జరిగింది?
రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో మంగళవారం కన్హయ్య లాల్ అనే టైలరును ఇద్దరు యువకులు అత్యంత దారుణంగా కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయింది. మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిషృత నేత నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా కన్హయ్య లాల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడని ఇద్దరు దుండగులు అతడిని దారుణంగా కత్తులతో నరికి చంపారు. టైలర్ ను హత్య చేస్తున్న దృశ్యాలను దుండగులు రికార్డ్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు నిందితులు. ప్రధాని మోదీని కూడా హత్య చేస్తామని ఆ వీడియోలో హెచ్చరించారు.
ఆ వీడియోలో ఇద్దరు నిందితుల్లో రియాజ్, మహ్మద్ అని పరిచయం చేసుకున్నారు. ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్యా లాల్‌ను దుండగులు కత్తితో 26 సార్లు నరికినట్టు పోస్టుమార్గం రిపోర్టులో తేలింది. తలపై 8-10 సార్లు నరికినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర రక్తస్రావం కారణంగా టైలర్ చనిపోయాడని నివేదికలో వైద్యులు తెలిపారు. ఈ హత్య ఘటనకు ముందు కన్హయ్య లాల్ తనకు ప్రాణహాని ఉందని స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా కాంప్రమైజ్ చేసి పంపినట్లు సమాచారం. వారం రోజుల పాటు టైలర్ షాపు కూడా తీయలేదని, మంగళవారం షాపు తెరవగా అదే రోజు అతడు హత్యకు గురయ్యాడు.
గంటల వ్యవధిలో నిందితులు అరెస్ట్
టైలర్ కన్హయ్యను హత్య చేసిన తరువాత నిందితులు రియాజ్, మహ్మద్ ఘటనాస్థలం నుంచి పారిపోయారు. పోలీసులు కేవలం 5 గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. తమను అరెస్ట్ చేసేలోపే, దేశం విడిచి పారిపోవచ్చని భావించారని పోలీసుల విచారణలో తేలింది. ప్లాన్ ప్రకారమే హత్య చేసి తప్పించుకోవాలని చూశారని, దర్జీ కన్హయ్య తరహాలోనే మరో వ్యక్తిని కూడా గొంతు కోసి హత్య చేయాలని నిందితులు ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: Udaipur Murder Case: జైపుర్‌లో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేసిన 'ఉదయ్‌పుర్' హంతకులు