వాట్సప్ అకౌంట్ కు డీపీగా పెట్టుకున్న ఫోటోలు... ఇద్దరు యువతుల ప్రాణాల మీదకు తెచ్చాయి. గుర్తుతెలియని ఆకతాయిలు వాటిని అశ్లీలంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారనే మనస్థాపంతో నల్గొండలోని రాజీవ్ పార్కులో మంగళవారం ఇద్దరు యువతులు గడ్డి మందు తాగడంతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.


 అనంతరం పార్కు గేటు బయట ఉన్న ఒక చెట్టు కిందకు వచ్చి పడిపోయారు. గమనించిన స్థానికులు యువతులిద్దరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థినిలు (19) జిల్లా కేంద్రంలోని హాస్టల్ లో ఉంటూ డిగ్రీ చదువుతున్నారు. వీరు ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నప్పటినుంచే స్నేహితులు. ఇటీవల పరీక్షలు రాసిన అనంతరం సెలవులు రావడంతో 20 రోజులుగా ఇంటి వద్ద ఉంటున్నారు. మంగళవారం కళాశాలలో ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఉదయం 9 గంటలకు నల్గొండకు చేరుకున్నారు. ఎన్జీ కళాశాల వెనుక భాగంలోని రాజీవ్ పార్కుకు వెళ్లారు.


అక్కడే గంటకు పైగా ఉన్న తర్వాత తమ వెంట తెచ్చుకున్న పురుగుమందును కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగేశారు. ఈ విషయాన్ని హాస్టల్లో ఉన్న తమ స్నేహితురాలికి సమాచారం అందించారు. అనంతరం గేటు బయట చెట్టు కిందకు వచ్చి పడిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు చేరుకొని నల్గొండలోని జనరల్ హాస్పిటల్ కు తరలించారు. మార్ఫింగ్ చేసిన తమ చిత్రాలను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టి బెదిరింపులకు పాల్పడుతుండటంతో  ఆత్మహత్య కు పాల్పడినట్లు సమాచారం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నల్గొండ టూ టౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపారు.


ఇన్ స్టాగ్రామ్ లో బెదిరించారని...


విద్యార్థుల మృతికి గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. కొందరు వారిని ఇన్ స్టాగ్రామ్ లో బెదిరిస్తున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. వారిద్దరి ఫోన్లలోని ఇన్ స్టాగ్రామ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంకా ఇద్దరి కాల్ డేట్ అని కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తమ పిల్లల మృతికి గల కారణాలు తెలియదని... పోలీసులే విచారించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గడ్డి మందును నార్కట్పల్లిలో కొనుగోలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వారి బ్యాగుల్లో నిద్ర మాత్రలు కూడా లభించినట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థులు ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 


తల్లిదండ్రుల రోదన....
కాలేజీకి వెళ్లిన తమ పిల్లలకు చనిపోయేంత పెద్ద కష్టం ఏమి వచ్చిందో అని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ పిల్లలు చదువుకొని ఉద్యోగాలు సాధిస్తారని ఎంతో ఆశ పెట్టుకున్నామని ఇంతలో ఇలా జరగడం హృదయాన్ని కలచి వేస్తోందని ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. నిజ నిజాలు బయటికి రావాలని వీరు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాలని పోలీసులను వేడుకుంటున్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.