Staff Nurse Posts Fraud In Sangareddy District: నిరుద్యోగుల అవసరం, ఆశలను ఆసరాగా తీసుకుంటున్న కొందరు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇద్దరు మహిళలు స్టాఫ్ నర్సు ఉద్యోగాల (Staff Nurse Jobs Scam) పేరిట భారీ మోసానికి పాల్పడ్డారు. ప్రభుత్వ అధికారులం అంటూ నమ్మించి నిరుద్యోగుల నుంచి దాదాపు రూ.లక్షలు దండుకున్నారు. ఏకంగా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఇద్దరు కి'లేడీ'లు భారీ మోసానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డికి చెందిన అనురాధ, మరియమ్మ అనే ఇద్దరు మహిళలు ప్రభుత్వ అధికారులం అంటూ ఐడీ కార్డులు సైతం ముద్రించుకున్నారు. నిరుద్యోగులే టార్గెట్‌గా వాటిని చూపిస్తూ మోసాలకు తెరతీశారు. నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఉద్యోగం కావాలంటే రూ.లక్షల్లో ఇవ్వాల్సి ఉంటుందని నిరుద్యోగులకు నమ్మబలికారు. వీరి మాటలు నిజమని నమ్మిన కొంతమంది నిరుద్యోగులు అప్పులు చేసి మరీ వారికి డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే, నేరుగా ఆఫీసుకు కాకుండా వారు చెప్పిన ప్రదేశంలో కవర్‌లో డబ్బులు పెట్టి ఇవ్వాలని సూచించారు. దీంతో బాధితులు వారికి అలాగే డబ్బులు ఇచ్చారు.


కలెక్టర్ సంతకం ఫోర్జరీతో..


ఇలా ఒక్కొక్కరు రూ.3 లక్షలు చొప్పున దాదాపు 28 బాధితుల నుంచి రూ.84 లక్షలు వసూలు చేశారు. అంతే కాకుండా ఏకంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన నిందితులు ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చారు. వీటిని తీసుకుని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి వెళ్లిన బాధితులు అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. అవి ఫేక్ అని అక్కడి సిబ్బంది చెప్పడంతో నిర్ఘాంతపోయారు. దీంతో తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని అనురాధ, మరియమ్మలను నిలదీయగా వారు బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇంట్లో చెప్పలేక, అప్పు తీర్చలేక కొంత మంది ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని తెలుస్తోంది. 


పోలీసులకు ఫిర్యాదు


ఈ ఘరానా మోసం వెనుక మరియమ్మ, అనురాధలే కాకుండా అసలు సూత్రధారులు వేరే ఉన్నారని బాధితులు అనుమానం వ్యక్తం చేశారు. తాము మోసపోయామని.. తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి భాగోతం వెలుగులోకి రాగానే మరికొందరు సైతం పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టారు. దీంతో షాకైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు.


Also Read: Hyderabad News: ఉప్పల్ మహిళ హత్య: శవాన్ని బాత్‌రూంలో పెట్టి తాళం - గంటల్లోనే కేసును చేధించిన పోలీసులు