Building Collapse: గత కొంత కాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు విపరీతమైన వరదలు వస్తున్నాయి. పురాతన ఇళ్లు, చెట్లు, స్తంభాలు వంటివి నేటికీ పడిపోతూనే ఉన్నాయి. అయితే ఈ భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని మండి బజారులో ఓ పాత భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన స్థానిక ప్రజలను కంట తడి పెట్టిస్తోంది. 


ఇంతెజార్ గంజ్ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన తిప్పారావు పైడి అనే 60 ఏళ్ల వృద్ధుడు మండి జబార్ లోని నిర్మాణంలో ున్న ఓ భవనానికి వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు సలీమా అనే మహిళ కూడా అక్కడే పని చేస్తున్నారు. వారిద్దరూ భవనం పరిసర ప్రాంతంలోని గుడిసెలో నివాసం ఉంటున్నారు. 


పక్కనున్న భవనం కూలి.. 


అయితే శుక్రవారం సాయంత్రం సలీమా కుమారుడు ఫిరోజ్(22) ఆమెను చూసేందుకు నగరానికి వచ్చాడు. భారీ వర్షం కురుస్తుండడంతో శనివారం తెల్లవారుజామున వారి గుడిసెకు సమీపంలో ఉన్న పాత భవనం ఒక్కసారిగి కుప్ప కూలిపోయింది. పాత భవనానికి సంబంధించిన గోడలు సలీమా నివసిస్తున్న గుడిసెపై పడ్డాయి. ఈ ఘటనలో పైడి, ఫిరోజ్ అక్కడికక్కడే మృతి చెందారు. సలీమా తీవ్ర గాయాల పాలైంది. 


అప్పటికే పైడి, ఫిరోజు లు మృతి..


విషయం గుర్తించిన స్థానికులు వెంటనే గుడిసె వద్దకు చేరుకొని చూశారు. అప్పటికే పైడి, ఫిరోజ్ లు మృతి చెందారు. అయితే తీవ్ర గాయాలో కొట్టుమిట్టాడుతున్న సలీమాను ఎంజీఎం ఆస్పత్రికి తరిలంచి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పైడి, ఫిరోజ్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


ఆదివారమే ఫిరోజ్ నిశ్చితార్థం..


సలీమా కుమారుడు ఫిరోజు కు తెల్లారితే నిశ్చితార్థం ఉందని... అందుకు అతను అమ్మను తీసుకెళ్లేందుకు ఇక్కడకు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఫిరోజ్ తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో నివసిస్తున్నాడు. ఫిరోజుకు ఈ మధ్యే వివాహం నిశ్చయం అయింది. రేపు నిశ్చితార్థం జరగాల్సి ఉండగా.. అందుకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు నగరానికి వచ్చాడు. తనతో పాటే అమ్మను కూడా తీసుకెళ్దామని ఇక్కడకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర, ఏసీపీ గిరి కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.