Himayat Sagar Accident: ప్రమాదం ఎప్పుడు ఎటు నుండి వచ్చి మీద పడుతుందో తెలియదు. అప్పటి వరకు ఆనందంగా గడిపిన వారు ఉన్నట్టుండి జరిగే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుపై ఎటు నుండి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం. మనం జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటి వారి నిర్లక్ష్యం వల్ల మనం ప్రాణాలు కోల్పోవచ్చు. వారు చేసే చిన్న తప్పిదం వల్ల ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది.  


అతివేగంగా వచ్చి ప్రాణాలు తీసిన కారు..


హైదరాబాద్ నగర శివారు హిమాయత్ సాగర్ ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళ్తున్నారు. వాళ్లు రోడ్డుపై కరెక్టుగానే వెళ్తున్నారు. కానీ ఓ కారు వచ్చి వారిని ఢీకొట్టింది. హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చింది ఆ కారు. అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న బైక్ ను బలంగా ఢీకొట్టింది. కారు వేగంగా వెళ్తుండటంతో బైక్ పై ఉన్న వారికి బలమైన గాయాలు అయ్యాయి. తీవ్ర రక్తస్రావం జరిగి వారిద్దరూ సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ప్రమాదం జరిగిందన్న సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ ను పిలిపించి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. రోడ్డుపై ఉన్న వాహనాలను తొలగించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టారు. 


కేసు నమోదు చేసుకుని దర్యాప్తు..


ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని పోలీసులు జార్ఖండ్ కు చెందిన జితేందర్, కేదారేశ్వర్ గా గుర్తించారు. మృతులు జార్ఖండ్ నుండి నగరానికి వచ్చి ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుస్తుందని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ మద్యం సేవించి మత్తులో అతి వేగంగా కారు నడిపాడా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. 


జగిత్యాల జిల్లాలో..


జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. జిల్లాలోని గొల్లపల్లి మండలం గోవిందపల్లి వద్ద జగిత్యాల నుంచి రాజరాంపల్లి వైపు వెళ్తోన్న ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్నఆటోను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న 8 మందికి తీవ్ర గాయాల అయ్యాయి. గాయాలపాలైన వారందరినీ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ కి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. బాధితులంతా వెల్గటూరు వైపు నుంచి మల్యాల వెళ్తుండగా ఎదురుగా వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ అతి వేగంగా ఆటోను ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన వారంతా మల్యాల మండల కేంద్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై గొల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.