Paravada Pharmacity in Anakapalle district | అనకాపల్లి: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో విషాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలోని ఎస్‌ఎస్‌ (Sai Sreyas) సంస్థలో బుధవారం అర్థరాత్రి విషవాయువులు లీకయ్యాయి. విష వాయువులు పీల్చడంతో ఇద్దరు ఉద్యోగులు మరణించారు. మృతులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన పరిమి చంద్రశేఖర్ , అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన సరగడం కుమార్ గా గుర్తించారు. 

సాయి శ్రేయాస్ కంపెనీలోని రసాయన వ్యర్ధాల ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్‌టీపీ దగ్గర లెవల్స్‌ను చెక్‌ చేయడానికి ముగ్గురు ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి వెళ్లారు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో విష వాయువులు లీక్ కాగా, చెకింగ్‌కు వెళ్లిన ఇద్దరు సేఫ్టీ ఆఫీసర్లు చంద్రశేఖర్‌, కుమార్ ప్రమాదకర గ్యాస్ పీల్చడంతో తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు. వీరి వెంట వెళ్లిన మరో ఉద్యోగి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అతడ్ని షీలానగర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్లాంట్ లోకి వెళ్లే సమయంలో సేఫ్టీ మాస్కులు ధరించారా లేదా, జాగ్రత్త చర్యలు తీసుకున్నారా లేదా అని ఉద్యోగుల సేఫ్టీకి కంపెనీ చర్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరవాడ సీఐ మల్లికార్జున రావు సాయి శ్రేయాస్ ఫార్మా కంపెనీకి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరవాడ ఫార్మాసిటీలో తరచూ ఏదో ఒక కంపెనీలు అగ్నిప్రమాదాలు సంభవించడమో లేక విష వాయువులు లీక్ కావడం లాంటివి జరుగుతున్నాయి. ఈ అనుకోని విషాదాలలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.

పోలీసులు ఇద్దరు ఉద్యోగుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఫార్మా సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్య క్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. గతంలో ఇదే పరిశ్రమలో ప్రమాదం జరిగిందని, భద్రతా ప్రమాణాల వైఫల్యం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని  గనిశెట్టి ఆరోపించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల భద్రతా వైఫల్యంపై పరిశ్రమ యా జమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని గణిశెట్టి కోరారు.