AP Group 1 Case | అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu)కు స్వల్ప ఊరట లభించింది. జిల్లా కోర్టు పీఎస్ఆర్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పిఎస్ఆర్ ఆంజనేయులు మెడికల్ రిపోర్ట్ ను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సీల్డ్ కవర్లో కోర్టుకి అందజేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా కోర్టు ఆయనకు 14 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు
హైబీపీతో పాటు గుండె సంబంధ అనారోగ్య సమస్యలతో పీఎస్ఆర్ ఆంజనేయులు బాధపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల అబ్జర్వేషన్ లో ఉన్నారు పిఎస్ఆర్. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌కు తీసుకెళ్లనున్నారని సమాచారం. వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో అవకతవకల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టయ్యారు. న్యాయవాదులు ఈరోజు వ్యక్తిగత పూచికత్తులు సమర్పించనున్నారు. దాంతో అంతా సరిగ్గా జరిగితే గురువారం మధ్యాహ్నం తర్వాత పీఎస్ఆర్ ఆంజనేయులు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
గ్రూప్ 1 అవకతవకలపై కొనసాగుతోన్న విచారణ
ఈ కేసులో పీఎస్ఆర్ తోపాటు దాత్రి మధును పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరు విజయవాడ సబ్ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారని తెలిసిందే. వారిని ఈ కేసు విచారణలో భాగంగా వేర్వేరుగా విచారిస్తున్నారు. అయితే పీఎస్ఆర్ ఆంజనేయులు అనారోగ్యానికి గురయ్యారు. తరచూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సి వస్తోంది. అదే సమయంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ విచారించిన కోర్టు.. అనారోగ్య కారణాలతో రెండు వారాలపాటు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది.