మహబూబాబాద్‌ లో దారుణం జరిగింది. ఎనిమిదో వార్డు కౌన్సిలర్‌, టీఆర్‌ఎస్‌ లీడర్‌ బానోతు రవిని దుండగులు హత్య చేశారు. పత్తిపాక కాలనీకి బైక్‌పై వెళ్తుండగా నరికి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. ప్రీప్లాన్డ్‌గా ఈ హత్య చేసినట్టు అక్కడి పరిస్థితులు చూస్తేనే అర్థమవుతుంది. 


బానోతు రవి చాలా సౌమ్యుడని స్థానికులు చెబుతున్నారు. ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న రవి.. మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా విజయం సాధించి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. స్థానికంగా మంచి పట్టుకున్న వ్యక్తి. రాజకీయంగా ఆయనకు శత్రువులు లేరని టాక్. 


ప్రస్తుతం మహబూబాబాద్‌ ఎంపీ కవితకు ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు బానోతు రవి. అందుకే హత్య జరిగిన వెంటనే రవి కుటుంబాన్ని పరామర్శించారు కవిత. అక్కడ వారి ఘోష చూసి ఎంపి కవిత కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ హత్యకు పాల్పడిన వారిని ఎవర్నీ వదిలి పెట్టేది లేదని చెప్పారామె. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 


రాజకీయంగా ఎలాంటి సమస్యల్లేవని స్థానికులు చెబుతున్నారు. వ్యక్తిగత కారణాలతో సన్నిహితులు ఎవరైనా హత్య చేసి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఇదే కోణంలో ఎంక్వయిరీ సాగిస్తున్నారు. పార్టీలో చాలా యాక్టివ్‌గా ఉండే వ్యక్తని ... అలాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో అన్న చర్చ నడుస్తోంది. స్నేహితుల మధ్య ఉన్న గొడలేమైనా హత్యకు దారి తీశాయా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది.  


మున్సిపల్ ఛైర్మన్‌ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయకు రాజకీయ శత్రువులు లేరన్నారు. వ్యక్తిగతంగా ఉన్న సమస్యల వల్ల ఎవరైనా ఈ హత్య చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. స్వతంత్రంగా గెలిచిన వ్యక్తికి రాజకీయ శత్రువులు ఎందుకు ఉంటారని ప్రశ్నించారాయన. స్థానిక ఎమ్మెల్యే శంకర్‌ నాయక్ కూడా రవి కుటుంబాన్ని పరామర్శించారు. ఫ్యామిలీ మెంబర్స్‌కు ధైర్యం చెప్పారు. 


టీఆర్ఎస్‌లో రెండు వర్గాల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి. అయితే అవి హత్యలు చేసుకునేంత స్థాయిలో లేవని చెబుతున్నారు.  స్థానికంగా చురుగ్గా ఉండే నేత రవి అని.. ఏదైనా వివాదాల్లో తలదూర్చాడేమోనని పోలీసులు విచారణ జరుపుతున్నారు. అధికార పార్టీ కౌన్సిలర్ హత్యకు గురికావడంతో సహజంగానే కలకలం రేపింది. ఈ హత్య వెనుక రాజకీయ ప్రత్యర్థులు ఉంటే మరింత రాజకీయ వివాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఖమ్మం,  రామాయంపేటల్లో ఆత్మహత్యల వ్యవహారంరాజకీయంగా కలకలం రేపుతోంది.