ఏపీలో రాజకీయం ఓదార్పుల చుట్టూ తిరుగుతోంది. అందులోనూ కౌలు రైతులకు ఓదార్పు పేరుతో పవన్ కళ్యాణ్ సాగిస్తున్న యాత్ర రెండో షెడ్యూల్ కూడా రెడీ అయ్యింది. ఇప్పటికే అనంతలో పర్యటించిన పవన్ 31 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్దిక సహయాన్ని కూడ అందించారు. ఇప్పుడు తాజాగా 23న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ పర్యటనకు షెడ్యూల్ రెడీ చేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇవ్వనున్నారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఏలూరు బైపాస్ మీదుగా చింతలపూడికి వెళతారు. ఆత్మహత్య చేసుకున్న కొంతమంది కౌలు రైతు కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తారు. జనసేన పార్టీ తరఫున లక్ష రూపాయలు పరిహారం అందిస్తారు. అనంతరం చింతలపూడిలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. బలవన్మరణాలకు పాల్పడిన మరికొంత మంది రచ్చబండ వేదికగా చెక్కులు అందచేస్తారు.
ఏపీలో కౌలు రైతు కుటుంబాలకు చెందిన సమస్యలు అనేకం ఉన్నాయి. వీటిని వేదికగా చేసుకొని రాజకీయ పార్టీలు దశాబ్దాలుగా పోరాటాలు సాగిస్తున్నాయి. వామపక్షాలకు చెందిన అనుబంధ సంస్థలు కూడా కౌలు రైతుల సమస్యలపై భారీగా పోరాటాలు చేశారు. కానీ అవన్ని అరెస్ట్ లకు మాత్రమే పరిమితం అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మరో అడుగు ముందు వేసి ఎకంగా రూ.5 కోట్ల విరాళాన్ని నష్టపరిహారంగా ప్రకటించటంతో పాటుగా వాటిని రైతులకు తానే స్వయంగా అందించేందుకు పర్యటనలకు చేపట్టారు.
పశ్చిమలో పవన్ క్రేజ్, కౌలు రైతులకు అండగా..
ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కు భారీగా క్రేజ్ ఉంది. పశ్చిమ గోదావరిలో పర్యటకు వస్తున్న పవన్ కు భారీగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులతో పాటుగా అభిమానులు కూడా రెడీ అవుతున్నారు. అయితే పాలిటిక్స్ లో జోరుగా పవన్ ముందుకు వెళ్లరు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే ఇప్పుడు పవన్ రెగ్యులర్ గా ప్రతి వారం పది రోజులకు కూడా యాక్టివ్ పాలిటిక్స్ వైపు వెళుతున్నారు. గతంలో ఆరు నెలలకు ఒకసారి పాలిటిక్స్ వైపు వచ్చే నాయకుడు అంటూ ఇతర పార్టీలకు చెందిన నాయకులు పవన్ ను వెటకారం చేసేవారు. ఇప్పుడు పవన్ కూడ యాక్టివ్ పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తుండటంతో రాజకీయం ఊపందుకుంటోంది. కౌలు రైతులకు ఎకంగా 5 కోట్ల రూపాయలు పరిహారాన్ని ప్రకటించిన పవన్, తానే స్వయంగా కౌలు రైతులను కలుసుకొని పరామర్శించి, వారికి ఆర్దిక సహకారాన్ని అందిస్తున్నారు.
ఇందుకు ప్రతి జిల్లాకు పవన్ ప్రత్యేకంగా సమయాన్ని కూడా కేటాయించారు. దీంతో అటు పార్టీ క్యాడర్‌తో పాటుగా అభిమానుల్లో కూడా నూతన ఉత్సాహం నెలకొంది. రాబోయే రోజుల్లో కౌలు రైతుల ఓదార్పు పేరుతో ప్రతి జిల్లాను పవన్ టచ్ చేసేందుకు రూట్ మ్యాప్ సిద్దం చేసుకోవటంతో రాజకీయాల్లో పవన్ ఫుల్ యాక్టివ్ అవుతున్న పవన్ ను చూసి క్యాడర్ ఖుషి అవుతోంది.