రంగారెడ్డి: హైదరాబాద్ అడ్డాగా మరోసారి డ్రగ్స్‌ దందా గుట్టురట్టయింది. నార్సింగిలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో ఓ యువతి డ్రగ్స్ తో దొరికింది. లావణ్య అనే యువతి వద్ద నాలుగు గ్రాముల డ్రగ్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఆ యువతి టాలీవుడ్ యంగ్ హీరో ప్రేయసి అని పోలీసులకు ప్రాథమిక విచారణలో తేలింది. ఇదే కేసులో మరో యువకుడ్ని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన లావణ్యకు రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. 


సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నార్సింగీలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం అందింది. దాంతో SOT పోలీసుల టీమ్ అక్కడికి చేరుకుని ఓ యువకుడు, యువతిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వారిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఓ యువకుడి వద్ద నుంచి ఆ యువతి డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. డ్రగ్స్‌తో అడ్డంగా దొరికిన యువతి టాలీవుడ్ యంగ్ హీరో ప్రేయసి అనే విషయం హాట్ టాపిక్ అవుతోంది. కొన్ని సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ప్రేయసి డ్రగ్స్ కేసులో దొరకడం సంచలనంగా మారింది.