Tirupati News : మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు అమలు చేస్తున్న కామాంధుల వెన్నుల్లో మాత్రం వణుకు పుట్టడం లేదు. కొందరు మృగాలుగా మారి అభం శుభం తెలియని బాలికలపై దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా బాలికను మాయ మాటలతో లొంగ తీసుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడో ఆర్టీసీ డ్రైవర్. అతడికి దేహశుద్ది చేసిన బాలిక తల్లిదండ్రులు.. పోలీసులకు అప్పగించిన ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగింది?
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న శ్రీనివాసులు(46)లపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు బుచ్చినాయుడు ఖండ్రిగ మండలంలో ఓ హైస్కూల్ లోని విద్యార్థుల బస్సును నడుపుతున్నాడు. అయితే శ్రీనివాసులు అభం శుభం తెలియని విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. శ్రీనివాసులు ప్లాన్ ప్రకారం బస్సులో ప్రయాణించే విద్యార్థినులకు చాక్లెట్స్, బిస్కట్స్, ఐస్‌క్రీం ఆశ చూపేవాడు. ప్రతిరోజు విద్యార్థినులకు మాయమాటలు చెబుతూ వారికి దగ్గర అయ్యాడు. అయితే తమతో ఉంది ఓ మృగం అని ఆ విద్యార్ధినులు తెలుసుకోలేకపోయారు. ఇలా విద్యార్థినులను మచ్చిక చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వాటిని తన ఫోన్ లో ఫొటోలు తీసుకుని వాటిని చూస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు నమోదు
అయితే శుక్రవారం సాయంత్రం తంగేళ్ళపాళ్యం లోని ఓ స్కూల్ లో చదువుతున్న ఓ బాలికను లొంగ దీసుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు శ్రీనివాసులు. ఈ విషయం చుట్టుపక్కల ప్రయాణికులు గమనించి శ్రీనివాసులకు దేహశుద్ధి చేసి శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే రెండో పట్టణ పోలీసు స్టేషన్ పోలీసులు తమ పరిధిలోకి రాదంటూ సత్యవేడు నియోజకవర్గంలోని బుచ్చినాయుడు కండ్రిగ మండలం పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుందని తెలియజేయడంతో కామాంధుడు శ్రీనివాసులును బుచ్చినాయుడు కండ్రిగ పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బుచ్చినాయుడు కండ్రిగ పోలీసులు నిందుతుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
లైంగిక వేధింపులు తాళలేక హత్య
ములుగు జిల్లా ఏటూరు నాగారం మూడో వార్డు ఎర్రెళ్లవాడలో ఓ యువతి తన అమ్మమ్మతో కలిసి ఉంటోంది. ఆమెకు తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవరూ లేరు. ఈ క్రమంలోనే వ్యవసాయ కూలీగా పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. అయితే అదే పట్టణానికి చెందిన పాతికేళ్ల రాంటెంకి శ్రీనివాస్ కు ఇది వరకే వివాహం అయింది. కానీ మనస్పర్థల కారణంగా భార్యా, పిల్లలు అతడిని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం అతడు ఒంటరిగానే ఉంటున్నాడు. మద్యం తాగి రాత్రి వేళ తరచుగా యువతి ఇంటికి వెళ్లి తలుపులు కొడుతూ ఆమెను వేధించేవాడు. లైంగిక వాంఛ తీర్చాలంటూ బలవంతం చేసేవాడు. అది తట్టుకోలేని యువతి.. కొన్ని నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. బెయిల్ పై బయటకు వచ్చిన శ్రీనివాస్ యువతిపై కోపం పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే వేధింపులు మరింత ఎక్కువ చేశాడు. ఇటీవల అర్ధరాత్రి మద్యం తాగి యువతి ఇంటికి వెళ్లాడు. బలవంతం చేస్తూ లైంగిక వాంఛ తీర్చమని నానా రచ్చ చేశాడు. ప్రతిరోజూ ఇలాగే జరుగుతుండడంతో.. కోపోద్రిక్తురాలైన యువతి.. శ్రీనివాస్ చేతులు కట్టేసి కత్తితో పొడిచి చంపేసింది. అనంతరం రాత్రి 2 గంటలకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై డి. రమేష్ తెలిపారు.