Tirupati Crime : పెళ్లంటే నిండు‌ నూరేళ్ల పంట అంటారు‌ పెద్దలు. సుఖ సంతోషాలతో‌ కలకాలం కలిసి జీవించాలని ఎంతో ఆనందంతో పెళ్లి చేసుకున్న ఓ యువతి జీవితం మధ్యలోనే ముగిసిపోయింది. కోటి ఆశల నూతన జీవితంలో అడుగు పెట్టిన‌ ఆ యువతి ఆశలు అన్ని అడియాశ చేశాడు భర్త. సూటి పోటి మాటలతో, వేధింపులకు గురిచేస్తూ ఆ యువతికి నరకం చూపించాడు. ఇంతలో అత్తారింటికి వెళ్లిన ఆ యువతి ఉన్నట్టుండి అదృశ్యం అయింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు ఐదు నెలల తరువాత మర్డర్ గా తేల్చారు. భార్య శవాన్ని సూట్ కేసులో పెట్టి చెరువులో‌ పడేసి ఆనవాళ్లు మాయం చేసిన ఘటన తిరుపతిలో కలకలం రేపుతుంది.


అసలేం జరిగింది? 


తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన పద్మ అనే యువతికి, సత్యనారాయణపురానికి చెందిన వేణుగోపాల్ తో 2019లో పెద్దలు వివాహం జరిపించారు. వేణుగోపాల్ ఉద్యోగరీత్యా సాఫ్ట్ వేర్ కావడంతో చెన్నైలో కాపురం పెట్టాడు. పెళ్లైన కొత్తలో భార్యతో ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా మెలిగేవాడు. నెమ్మదిగా వేణుగోపాల్ తన పైశాచికత్వం మొదలుపెట్టాడు. ‌మానసికంగా వేధింపులకు గురిచేస్తూ, అనుమానంతో అనరాని‌ మాటలు మాట్లాడుతూ చిత్ర హింసలకు గురి చేసేవాడు. పెళ్లైన ఐదు నెలలకే భర్త వేధింపులు, చిత్ర హింసలు భరించలేని పద్మ పుట్టింటికి వచ్చేసింది. పలుమార్లు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి తిరిగి అత్తారింటికి పంపినా వేణుగోపాల్ లో మాత్రం మార్పురాలేదు. సైకోగా ప్రవర్తిస్తూ పద్మపై అర్ధరాత్రి విరుచుకుపడేవాడు. వేణుగోపాల్ కు విడాకులు‌ ఇచ్చేమని పద్మ కుటుంబీకులు ఆలోచన చేసినా, విడాకులు తీసుకుని వేరొక వివాహం చేసుకుంటే, మరోక భర్త ఎలా ప్రవర్తిస్తాడో అని ఆందోళన చెందిన పద్మ, మరోసారి వేణుగోపాల్ కి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. 


చివరి అవకాశం 


పద్మ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నాక తన కాపురం సర్దుకుంటుందనే భావనతో అత్తారింటికి ఈ ఏడాది జనవరి నెలలో వెళ్లింది పద్మ. ఇంటికి వెళ్లిన అర్ధగంటలోపే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన భర్త వేణుగోపాల్ పద్మ తలపై రోకలి బండ లాంటి చెక్కతో బలంగా కొట్టాడు. తలకు తీవ్ర గాయమై ఘటనా స్థలంలోనే పద్మ మృతి చెందింది. హత్యను కప్పిపుచ్చేందుకు వేణుగోపాల్ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నం చేశారు. పద్మ మృతదేహాన్ని కొన్ని చీరలతో చుట్టి, ఒక సూట్ కేసులో ఉంచారు. అనంతరం చాకచక్యంగా వెంకటాపురం చేపల చెరువులో సూట్ కేసును పడేశారు. అప్పటి నుంచి పద్మ ఆచూకీ గానీ, ఫోన్ కాల్ గానీ కుటుంబ సభ్యులకు తెలియలేదు. అల్లుడు వేణుగోపాల్ కు కాల్ చేస్తే పద్మ మీతో మాట్లాడదు. మిమ్మల్ని కలవదు, నేను ఆఫీస్ లో ఉన్నాను అనే సమాధానం ఇచ్చేవాడు. కొన్నాళ్లుగా ఇదే సమాధానం ఇస్తుండడంపై పద్మ కుటుంబీకులకు అనుమానం వచ్చింది. 


పోలీసులకు ఫిర్యాదు


ఈ నెల 27వ తేదీ తిరుపతి ఈస్ట్ పోలీసులకు పద్మ అదృశ్యానికి అల్లుడే కారణం అని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారి స్టైల్ లో విచారణ చేపట్టడంతో వేణుగోపాల్ నిజాన్ని చెప్పాడు. అతన్ని అరెస్ట్ చేసి సీన్ రీ క్రియేట్ చేశారు పోలీసులు. వేణుగోపాల్ తో పాటుగా, అతనికి సహకరించిన వేణుగోపాల్ స్నేహితుడు సంతోష్, కుటుంబ సభ్యులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.