Tirupati Crime : తిరుపతి‌ నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లు, సింగిల్ హౌస్ లను టార్గెట్ చేసుకుని దొంగతాలకు పాల్పడుతున్నారు గజదొంగలు. నగరంలో రాత్రి సమయాల్లో సంచరిస్తూ ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను ఎట్టకేలకు తిరుపతి పోలీసులు పట్టుకున్నారు. తిరుపతి, ఎం.ఆర్.పల్లె, అలిపిరి, తిరుచానూరు పరిధిలో దొంగతనాలకు పాల్పడి దోచుకున్న నగదు, బంగారంతో జల్సాలకు పాల్పడుతున్నారు. అరెస్టు చేసి వారి వద్ద నుంచి దాదాపు యాభై లక్షల‌ రూపాయలు విలువ చేసే 943 గ్రాముల‌ బంగారం, మూడు కిలోల వెండి సామాన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి మీడియా ముందు హాజరుపరిచారు. 



అంతర్రాష్ట్ర గజదొంగలు 


తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను తిరుపతి క్రైం పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. గురువారం సాయంత్రం పాతకాల్వ సమీపంలోని వకుళామాత ఆలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి‌ తీసుకుని పోలీసుల స్టైల్ లో విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. విశాఖ గాజువాక బాబూజీ నగర్ కాలనీకి చెందిన కర్ర సతీష్ అలియాస్ సతీష్ రెడ్డి(38) గత రెండేళ్లుగా తిరుపతి నగరంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, విజయవాడ, నెల్లూరు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో సుమారు 80కు పైగా కేసులు నమోదు చేశారు. ఇతనిపై విశాఖపట్నం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్,‌ హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో పీడీయాక్ట్ నమోదు అయ్యింది. మరో నిందితుడు నరేందర్ నాయక్ అలియాస్ నారి(26) నల్గొండ జిల్లా చిన్నపేట మండలంలో నివాసం ఉంటున్నాడు. ఇతనిపై తెలంగాణ హైదరాబాద్ సిటీ, వనస్థలిపురం, సరూర్ నగర్, ఇబ్రహీంపట్నం, చిలకలగూడ, నేరేడు మిట్ట, బంజారాహిల్స్, దేవరకొండ, తమిళనాడులో మొత్తం కలిపి సుమారు 38 కేసులు నమోదై అయ్యాయి. ఇతనిపై ఇటీవల పీడీ యాక్ట్ నమోదు అయింది. 



దొంగతనం చేసిన డబ్బుతో జల్సాలు 


 రేయింబవళ్లు అనే తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడి దోచుకున్న డబ్బులతో జల్సాలు చేస్తారు. వీళ్లు నచ్చిన, మెచ్చిన ప్రాంతాలకు వెళ్లి మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తూ టూర్ లు వేసేవారు.. విలాసవంతమైన హోటల్స్ ను అద్దెకు తీసుకుని‌ రిచ్ గా జీవితాన్ని ఎంజాయ్ చేసేవారు. ఇలా దొచ్చుకున్న నగదు, బంగారంతో ఎంజాయ్ చేసేవారు. డబ్బు అయిపోయాక మళ్లీ ఎంచుకున్న ప్రాంతాలకు చేరుకుని దొంగతాలకు పాల్పడేవారు.