టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఎనిమిది మందిని ఈ కేసులో అనుమానిస్తున్నారు. అలాగే హత్య చేసేందుకు వాడిన కత్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఏ2 గా ఉన్న రంజాన్, ఏ4 గంజి స్వామి, ఏ5 లింగయ్య, ఏ6 బోడిపట్ల శ్రీను, ఏ7 నాగేశ్వర రావు, ఏ8 నాగయ్యగా పోలీసులు పేర్కొన్నారు. అయితే నిందితుల అందరినీ పట్టుకునేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుప్లలిలో పోలీసుల పహారా కాస్తున్నారు. 


పోలీసులు బృందాలుగా ఏర్పడి తెల్దారుపల్లి కూడళ్లలో పహారా కాస్తున్నారు. 92 మంది పోలీసులు 12 చోట్ల పికెటింగ్ నిర్వహిస్తున్నారు. 12 మంది ఎస్ఐలు, ఇద్దరు సీఐల ఆధ్వర్యంలో పికెటింగ్ కొనసాగుతోంది. మండలవ్యాప్తంగా ఈనెల 18వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సీపీ విష్ణు ఎస్. వారియర్ తెలిపారు. 


అసలేం జరిగిందంటే?


మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యనుప పంద్రాగస్టు నాడే గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లిలో బైక్‌పై వెళ్తోన్న ఆయనను దుండగులు ఆటోతో ఢీకొట్టి అనంతరం వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో ఆరుగురు పాల్గొనున్నట్లు తెలుస్తోంది. తెల్దారుపల్లి శివారులోని రోడ్డుపై ఈ దాడి ఘటన జరిగింది. తమ్మినేని కృష్ణయ్య ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా ఉన్నారు.  


కోటేశ్వరరావు ఇంటిపై దాడి 


తమ్మినేని కృష్ణయ్య హత్యకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు కారణమని తెల్దారుపల్లికి చెందిన స్థానిక నేతలు ఆరోపించారు. కోటేశ్వరరావు ఇంటిపై వారు దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కృష్ణయ్య వరుసకు సోదరుడు అవుతాడు. కృష్ణయ్య సీపీఎంలో పని చేశారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. తెల్దారుపల్లిలో రాజకీయ విద్వేషాలే ఈ దారుణ హత్యకు కారణంగా తెలుస్తోంది. వీరభద్రం సొంత సోదరుడితో కృష్ణయ్యకు విభేదాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. ఈ హత్య అనంతరం కృష్ణయ్య వర్గీయులు తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై దాడి ఇంట్లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో తెల్దారుపల్లిలో హైటెన్షన్ నెలకొంది. గ్రామంలో మోహరించిన పోలీసులు అప్పటి నుంచి పహారా కాస్తున్నారు. 


ఇప్పటికీ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్ల చేశారు. గ్రామంలో గట్టి బందోబస్తును కొనసాగిస్తున్నారు. గ్రామంలోని ప్రతీ ఇంటిపై నిఘా పెట్టారు. గ్రామస్థులు, ముఖ్యంగా కృష్ణయ్య అనుచరుల కదలికలపై పోలీసులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. 


తమ్మినేని వీరభద్రానికి భద్రత పెంపు


ఈ సంఘటన జరిగిన వేళ తమ్మినేని వీరభద్రానికి పోలీసులు భద్రతను పెంచారు. 1+1 సెక్యూరిటీ కల్పించారు.