Three People Died In Riots In Kakinada: ఏపీలో దారుణాలు చోటు చేసుకున్నాయి. కాకినాడ జిల్లాలో (Kakinada District) రెండు కుటుంబాల మధ్య ఘర్షణతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు మండలం శలపాకలో రెండు కుటుంబాల మధ్య జరిగిన కత్తుల దాడిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం రాత్రి పక్కపక్కనే ఉంటున్న 2 కుటుంబాల మధ్య ఓ మహిళ విషయంలో వివాదం రేగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురిపై మరో కుటుంబం విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసింది. ఈ దాడిలో బత్తుల రమేశ్, బత్తుల చిన్ని, బత్తుల రాజులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా అతన్ని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


చీకట్లో మరణ మృదంగం..


గురువారం దీపావళి కావడంతో టపాసులు కాల్చుకున్న స్థానికులు సద్దుమణిగారు. ఆ తర్వాత విద్యుత్ కూడా లేకపోవడంతో ఒక్కసారిగా కేకలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎదురెదురు ఇళ్లకు చెందిన మృతులు బత్తుల రమేష్‌ కుటుంబం, పొట్లకాయల నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన వారు కొట్లాడుకుంటున్నారని అర్ధమైందని, అయితే అంతా చీకటిగా ఉండగానే ఆర్తనాదాలు వినిపించాయని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే పొట్లకాయల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు కత్తులు, గునపాలతో మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని, ఘటన జరుగుతున్న సమయంలో విద్యుత్ లేకపోవడంతో భయంతో చీకటిలో ఎవ్వరూ ముందుకు వెళ్లేందుకు సాహసించలేకపోయినట్లు పోలీసుల విచారణలో తెలిపారు. ఇదిలా ఉంటే కరెంటు వచ్చాక చూస్తే బత్తుల రమేష్‌, బత్తుల రాజేష్‌, బత్తుల చిన్నిలు రక్తపు మడుగులో మృతి చెంది కనిపించారని, మరో వ్యక్తి తీవ్రగాయాలతో ఉండగా అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.


గ్రామంలో పోలీసు పహారా


విషయం తెలిసిన వెంటనే ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. శలపాక గ్రామంలో తదుపరి ఘర్షణలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ, ఎస్సైలు, సిబ్బంది ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ప్రియురాలిని చంపేసిన ప్రియుడు


మరోవైపు, సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. ఓబులదేవరచెరువు మండలం కొండకమర్ల గ్రామంలో ఓ వ్యక్తి వివాహితను గొంతు నులిమి హతమార్చాడు. డబురువారిపల్లికి చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తితో కొద్దికాలంగా మెహతాజ్ అనే మహిళ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఆమె వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో సహించలేని ఇర్ఫాన్ ఆమెపై కక్షతో ఇంట్లోనే గొంతు నులిమి చంపి పరారయ్యాడు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


తుపాకీ మిస్ ఫైర్


అటు, అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. తుపాకీ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు కానిస్టేబుల్ సుబ్బరాజు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Free Gas Cylinder Scheme: శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం