Medchal Road Accident: మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూప్రాన్ నుంచి నగరానికి బైక్ పై వెళ్తున్న ఓ జంటకు ఓ వ్యక్తి అనుకోకుండా అడ్డుగా వచ్చాడు. అతడిని తప్పించబోయిన బైకర్ డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు కింద పడిపోయారు. వీరితో పాటే రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా పడిపోయారు. అయితే వెనుక నుండి వస్తున్న లారీ వారిని గమనించకుండా.. వారి పైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఈ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ, డివైడర్ దాటి వచ్చిన ఓ వ్యక్తి, బైకర్ ఉన్నాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వర్షాకాలం కావడం ఆపై డివైడర్ పై చెట్లు పెరగడంతో రోడ్డు దాటుతున్న వ్యక్తిని గమనించలేకపోయాడు బైకర్. అతడిని తప్పించబోయే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి..
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా వైపు వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనంపై హఠాత్తుగా భారీ వృక్షం పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రుడ్ని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన యువకులు ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతానికి వెళ్తుండగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎగ్బాల్ పూర్ గ్రామ సమీపంలోని నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిలో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనంపై హఠాత్తుగా భారీ వృక్షం విరిగిపడింది.
టాటా మ్యాజిక్ వాహనంలో ప్రయాణిస్తున్న భుచ్చన్న, రవి అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఇందులో నిఖిల్ అనే మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడ్ని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి నిజామాబాద్ తరలించారు. టాటా మ్యాజిక్ వాహనంలో ప్రయాణిస్తున్న మరికొందరికి సైతం స్వల్పంగా గాయాలయ్యాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి ఖానాపూర్ సీఐ అజయ్ బాబు, ఎస్సై రజినీకాంత్ , పోలీస్ సిబ్బందితో చేరుకొని జేసీపీ సహాయంతో చెట్టును తొలగించి వాహనాన్ని బయటకు తీశారు.
వాగులో కొట్టుకుపోయిన కారు ..
వేములవాడలో ఘోరం జరిగింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు ఇద్దరి ప్రాణాలను బలిగొంది. జగిత్యాల జిల్లా చల్ గల్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ వెళ్తుండగా వేములవాడ రూరల్ ఫాసుల్ నగర్ వద్ద బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వాగును దాటుతుండగా ప్రమాదం జరిగింది. కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. రిజ్వాన్( డ్రైవర్), నరేష్ అనే వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే నీటి ఉద్ధృతి అధికంగా ఉండడంతో జేసీబీ సహాయంతో కారును బయటకు తీసిన పోలీసులు అందులో చిక్కుకున్న గంగ (బుద్ది) అనే మహిళ (47) మనువడు కిట్టు (2) మృత దేహాలను వెలికి తీశారు.