Three People Died Due To Man Hole Cleaning: పొట్ట కూటి కోసం హైదరాబాద్ (Hyderabad) వలస వచ్చిన వారిని మ్యాన్ హోల్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పురానాపూల్ చౌరస్తా సమీపంలోని జియాగూడ బైపాస్ రోడ్డుపై గల ఎస్టీపీ (సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్) నుంచి కార్వాన్ మొఘల్ కా నాలా వరకు జలమండలి ప్రాజెక్ట్ విభాగం ఆధ్వర్యంలో భారీ సీవరేజీ పైప్ నిర్మాణాన్ని చేపట్టారు. దీని నిర్మాణం ఓ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టగా, ఏడాది కాలంగా సాగుతోంది. కొత్త పైప్ లైన్ నిర్మిస్తూనే దానికి స్థానిక కాలనీల సీవరేజీ లైన్లను అనుసంధానం చేశారు. అయితే, పైప్ లైన్ పొడవునా భారీ మ్యాన్ హోళ్లను సైతం నిర్మించి వాటిలోని పైపుల్లోకి డ్రైనేజీ నీరు చేరకుండా గోనె సంచులతో పైపులు మూసేశారు. కాగా, ఎస్టీపీ సమీపంలో వీటిని తొలగించేందుకు శుక్రవారం సాయంత్రం నలుగురు కూలీలు పనులు చేపట్టారు. ముగ్గురు మ్యాన్ హోల్ లోకి దిగగా.. మరో కూలీ బయటే ఉన్నాడు. ఈ క్రమంలో సంచులను తొలగిస్తుండగా.. పైపుల నుంచి విష వాయువులు వెలువడి ఇద్దరు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయారు. మరో కూలీని.. బయట ఉన్న కూలీ, స్థానికులు బయటకు లాగారు. 


సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రెస్క్యూ బృందం సాయంతో ఇద్దరినీ బయటకు తీశారు. బాధితులందరినీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో వ్యక్తిని ఉస్మానియాకు తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతులు కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన హన్మంతు (40), వనపర్తి జిల్లాకు చెందిన శ్రీనివాస్ (40), నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన వెంకట్ రాములు (50)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబీకులు అక్కడకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ - కాలేజీ కోసం వేసిన రోడ్డు తొలగింపు, కావాలనే టార్గెట్ చేశారన్న బీఆర్ఎస్ నేత