Siddipet District News: బతుకమ్మ పండుగ మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. చెరువు మెట్లను శుభ్రం చేయడానికి వెళ్లి ముగ్గురు కార్మికులు మృత్యువాత పడ్డారు. హృదయాలను కలచివేసే ఘటన సిద్దిపేట జిల్లాలో జగదేవపూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో శనివారం రోజు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జగదేవపూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో బతుకమ్మ పండుగ‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సఫాయి కార్మికులు గిరిపల్లి భారతి (45), ఎల్లం యాదమ్మ (42), కర్రెమోల్ల బాబు (26), మధు, నాగేష్, విజయతోపాటు కారోబార్ పనిచేస్తున్న లచ్చయ్య పటేల్ చెరువు వద్ద బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మెట్లను శుభ్రం చేశారు. అనంతరం తిరిగి చెరువులో కాళ్లు చేతులు శుభ్రం చేసుకోవడానికి చెరువులోకి దిగారు. 


ఈ క్రమంలో ఎల్లం యాదమ్మ ప్రమాదవశాత్తు నీట మునిగిపోయింది. ఆమెను కాపాడడానికి గిరిపల్లి భారతి, బాబులు ప్రయత్నం చేయగా వారు కూడా నీట మునిగారు. వారితోపాటు విజయ, నాగేశ్ కూడా నీట మునుగుతుండడంతో గట్టుమీద ఉన్న మధు గమనించి చెరువులో దూకి విజయ, నాగేష్‌ను గట్టుకు లాక్కొచ్చారు. అప్పటికే మిగతా ముగ్గురు చెరువులో మునిగి గల్లంతయ్యారు. వెంటనే చెరువు కట్టపై ఉన్న మరో వ్యక్తి వారిని రక్షించేందుకు ప్రయత్నం చేసిన ఫలించలేదు.


విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ భాను ప్రకాష్ రావు స్థానికులు చెరువు దగ్గరకు చేరుకున్నారు. అనంతరం రాంనగర్‌కు చెందిన గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులోకి దిగి  బాబు (25) , గిరిపల్లి భారతి (40), ఏళ్లం యాదమ్మ(43) మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ఎల్లం యాదమ్మ భర్త భూమయ్య గ్రామపంచాయతీలో హెల్పర్ గా విధులు నిర్వహించేవాడు. భూమయ్య గ్రామంలో విద్యుత్ పనులు చేస్తూ, స్తంభం‌పై నుంచి కింద పడి నడుము విరిగిపోయింది. పనిచేయలేని పరిస్థితి. యాదమ్మ పంచాయతీ కార్మికురాలిగా పనిచేస్తూ ఇంటిని పోషించుకునేది. మరో మృతురాలు గిరిపల్లి భారతి భర్త మల్లేశం 15 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతురాలికి కూతురు శ్యామల వివాహం జరగగా, కుమారుడు వంశీ తీగుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు.


సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ, ఎఫ్ డీసీ
తిగుల్‌లో ముగ్గురు సపాయి కార్మికులు విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. నీట మునిగిన సపాయి కార్మికుల మృతదేహాలను వెలికితీత పనులు పనులను పర్యవేక్షించారు. ఘటన పై మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల మృతి బాధాకరమన్నారు. దురదృష్టవశాత్తు జరిగిన ఈ సంఘటన పై విచారం వ్యక్తం చేస్తూ పారిశుధ్య కార్మికుల మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు అన్ని విధాల అండగ ఉంటామని, ప్రభుత్వం తరపున వారిని అందుకుంటామని చెప్పారు. మహిళలు సంతోషంగా బతుకమ్మ సంబరాలు జరుపుకునే చోట ముగ్గురి మృతితో విషాదం అలముకుంది.