Civils Aspirants Died Due To Floods In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సివిల్స్ సాధించి దేశానికి సేవలందించాలి అనుకున్న ఆ విద్యార్థులను వరద నీరు మృత్యువు రూపంలో కబళించింది. భారీ వర్షాలతో సెంట్రల్ ఢిల్లీ ఓల్ట్ రాజిందర్ నగర్‌లోని ఓ భవనంలో నిర్వహిస్తోన్న రావుస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి శనివారం సాయంత్రం వరద పోటెత్తింది. ఈ క్రమంలో అక్కడ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులు నీట మునిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు వెలికితీశారు. అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి 7 గంటల ప్రాంతంలో తమకు స్టడీ సెంటర్ నీట మునిగినట్లు ఫోన్ వచ్చిందని అగ్ని మాపక విభాగం అధికారులు తెలిపారు. వెంటనే 5 అగ్నిమాపక యంత్రాలతో అక్కడికి వెళ్లామని.. భవనం అడుగు భాగం పూర్తిగా జలమయమైందని చెప్పారు. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. మృతులు తానియా సోని (25), శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28)గా గుర్తించారు. వీరు తెలంగాణ, కేరళ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని తెలుస్తోంది.














విద్యార్థుల ఆందోళన










మరోవైపు, ఈ ఘటనకు నిరసనగా కోచింగ్ సెంటర్ వద్ద విద్యార్థులు ఆదివారం ఆందోళనకు దిగారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే కౌన్సిలర్‌కు తెలిపినా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని మండిపడ్డారు. దీనిపై కౌన్సిలర్, ప్రభుత్వం యంత్రాంగం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అటు, స్టడీ సర్కిల్ యజమాని, కోఆర్డినేటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


స్వాతీ మాలీవాల్‌కు నిరసన సెగ


ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా అధికారులు ఇక్కడకు రాలేదని మండిపడ్డారు. నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు. అయితే, ఆమెను విద్యార్థులు అడ్డుకున్నారు. దీన్ని రాజకీయం చెయ్యొద్దని.. 'స్వాతీ మాలీవాల్ గోబ్యాక్' అంటూ నినాదాలు చేశారు.


'నిర్లక్ష్యమే కారణమా.?'


ఘటనకు నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. '10 నిమిషాల్లో బేస్మెంట్ నిండిపోయింది. సాయంత్రం NDMAకు కాల్ చేశాం. వారు చాలాసేపటి తర్వాత వచ్చారు. అప్పటికే నా సహచరులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చేరారు. ఈ భయానక ప్రమాదం నుంచి బయటపడిన వారిలో నేనూ ఒకడిని' అంటూ ఓ అభ్యర్థి తెలిపారు.






Also Read: Jammu Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్ కౌంటర్ - ఒక జవాన్ మృతి, కెప్టెన్ సహా నలుగురికి గాయాలు