RTC Conductor Suicide : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఆర్టీసీ డిపోలో విషాద ఘటన జరిగింది. డ్యూటీలో ఉన్న కండక్టర్ గార్లపాటి మహేందర్ రెడ్డి (55) బస్సులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహేందర్ రెడ్డికి భార్య అరుణ , ఇద్దరు కుమారులు విక్రమ్, వినయ్ లు ఉన్నారు. ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అనారోగ్యంగా ఉందని ఆర్టీసీ డిపోలో లీవ్ పెట్టి ఇంటి వద్ద ఉన్నాడు మహేందర్ రెడ్డి. ఈరోజు లీవ్ ఉన్నప్పటికీ డ్యూటీకి వచ్చాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు డ్యూటీకి వచ్చిన కండక్టర్ మహేందర్ రెడ్డి ఆర్టీసీ డిపో ఆవరణలో పార్కింగ్ చేసి ఉన్న బస్సులో తన వెంట తెచ్చుకున్న టవల్ తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకి దించి పంచనామ చేసిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. 


ఆర్టీసీ అధికారుల ఒత్తిడే కారణమా? 


ఈ ఘటనపై సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని రోధించారు. మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ అధికారుల ఒత్తిడి వల్లే మహేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేసి నిజాలు బయటపెట్టాలని కోరుతున్నారు. 


గుంటూరులో మరో విషాదం


అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె.. ఓ ఆటో డ్రైవర్ ను ప్రేమించింది. వద్దని చెబుతున్నా వినకుండా అతడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అయితే విషయం తెలుసుకున్న తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన పరువు పోయిందని బావురుమంది. ఊళ్లో వాళ్లు అంటున్న మాటలు వినలేక.. తన కూతురు పరువు తీసి వెళ్లిపోయిందని భావించిన తల్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గుండారం గ్రామంలో పరువు ఆత్మహత్య చోటు చేసుకుంది.  దాసరి అనితకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు గతంలోనే వివాహం అయింది.  అయితే రెండో కుమార్తె డిగ్రీ చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసుకున్న తల్లి పలుమార్లు కూతురును మందలించింది. ఈ నెల ఏడవ తేదీన కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమించిన ఆటో డ్రైవర్ ను వివాహం చేసుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న తల్లి అనిత తల్లడిల్లి పోయింది. గ్రామంలో పలు విధాలుగా ప్రచారం జరగడంతో తట్టుకోలేక పోయింది. ఈ ప్రేమ వివాహంతో తమ కుటుంబ పరువు రోడ్డుపై పడిందని ఆవేదన చెందింది.ఈ క్రమంలోనే ఆమె నిన్న రాత్రి ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న చేబ్రోలు పోలీసులు విచారణ చేస్తున్నారు.