Phones Theft: ప్రజలంతా పెద్ద పెద్ద వినాయకుల్ని చూస్తూ ఎంజాయ్ చేసేందుకు నిమజ్జనోత్సవానికి వచ్చారు. కానీ కొందరు మాత్రం వచ్చిన వాళ్ల నుంచి దొరికిన కాడికి దోచేందుకు ప్లాన్ వేశారు. అంతేనా గుంపులు గుంపులుగా ఉన్న చోటకు చేరి ఎవరికీ తెలియకుండా వందల సంఖ్యలో పోన్ లు కొట్టేశారు. ఇలా దాదాపు ఒకే రోజులో 1000 నుంచి 1200 సెల్‌ఫోన్లను మాయం చేశారు. ఈ జాబితాలో 5 వేలు రూపాయల ఫోన్ల నుంచి లక్షన్నర వరకు ఖరీదైనవి ఉన్నాయి. మహా నగరంలో ఇటీవల గణనాథుల విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం అట్టహాసంగా జరిగాయి.
ఓ వైపు భక్తుల హోరు.. ఇటు దొంగల జోరు !
వేలాది విగ్రహాలు.. లక్షలాది మంది భక్తజనంతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఇక ట్యాంక్ బండ్ పైన భక్తుల సందడి ఎలా ఉంటుందో సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువతీ యువకుల కోలాహలం.. డప్పుల మోత.. డీజేల హోరుతో నృత్యాలు చేశారు. ఇదే అదనుగా భావించిన జేబు దొంగలు ఏమాత్రం అనుమానం రాకుండా జేబులు కత్తిరించి ఫోన్లను చోరీ చేశారు. ఫోన్ పోయిన కాసేపటికి విషయం గుర్తించిన వారంతా పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికీ పోలీసుల వద్దకు ఫోన్లు పోయాయనే కేసులు వస్తూనే ఉన్నాయి. ఐఎంఈఐ నంబర్ల (IMEI Numbers) ఆధారంతా వాటి ఆచూకీ తెలుసుకొనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఖైరతాబాద్ మహాగణపతి ఊరేగింపులోనే అధికం..
ఎక్కువ ఫోన్లు పోయింది మాత్రం ఖైరతాబాద్ మహా గణపతి ఊరేగింపు (Khairatabad Ganesh Nimajjanam 2022)లోనేనని నగర పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 9వ తేదీన ఖైరతాబాద్ మహా గణపతి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు హాజరు అయ్యారు. ఊరేగింపుగా బయలు దేరిన బడా గణేశుని దగ్గరగా చూసేందుకు తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ లో లక్షలాది మంది చేరారు. సైఫాబాద్ ఠాణా పరిధిలో గత నెల 31 నుంచి 8 వరకు 36 సెల్‌ఫోన్లు మాయమైతే శుక్ర, శనివారాల్లోనే 98 ఫోన్లు పోగొట్టుకున్నట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో శనివారం ఒక్కరోజే 400 నుంచి 500 ఫోన్లు పోయినట్టు కేసులు నమోదు అయ్యాయి. దొరికిన ఫోన్లను పలువురు భద్రంగా తీసుకొచ్చి అప్పగిస్తున్నారని, వాటిని యజమానులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆబిడ్స్ ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావు తెలిపారు.
మొన్న బోనాల ఉత్సవాల్లో, నేడు గణేష్ నిమజ్జనోత్సవాల్లో..!
అదను చూసి కొట్టేసే ముఠాలు.. నగరంలో రద్దీగా ఉండే ప్రదేశాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి నుంచి నలుగురు సభ్యులుగా ఏర్పడిన మఠాలు.. గణేష్ నిమజ్జనోత్సవంలోనే కాకుండా ఇటీవల జరిగిన బోనాల వేడుకల్లో కూడా 40 మంది ఫోన్లను దోచేశారు. ఒక్క సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలోనే ఇన్ని ఫోన్ల దొంగతనం జరగడం గమనార్హం. వినాయక ఉత్సవాల్లోనూ ఇవే ముఠాలు సెల్ చోరీలకు పాల్పడి ఉండవచ్చనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.