Thief Gun Firing On Police In Gachibowli: హైదరాబాద్ గచ్చిబౌలిలో (Gachibowli) శనివారం సాయంత్రం కాల్పులు కలకలం రేపాయి. ప్రిజం క్లబ్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. నిందితుడు పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామానికి చెందిన బత్తుల ప్రభాకర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా చోరీ కేసుల్లో నిందితుడు. ఇతను ప్రిజం పబ్‌లో ఉన్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు అక్కడకు వెళ్లి పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో ప్రభాకర్ పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు.
రెండు రౌండ్లు కాల్పులు జరపగా మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, పబ్ బౌన్సర్‌కు గాయాలయ్యాయి. వీరిని వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రభాకర్ 2022లోనే విశాఖ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు.