Bhadradri Temple Fake Account :  చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఆకతాయిలు.. ఇతరుల మనోభావాలను కించ పర్చాలనుకునే పోకిరీల విపరీత చేష్టలకు హద్దూ పొద్దూ లేకుండా పోతోంది. ఏకంగా భద్రాద్రి రాముడి పేరుతోనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్య, అశ్లీలకరమైన దృశ్యాలను పోస్ట్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఐటీ నిపుణుల సాయంతో ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయించినా కూడా ఆ పోకిరి గంటలోనే మళ్లీ యాక్టివేట్ చేసుకుని..  పోస్టింగ్‌లు చేస్తూండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 


రాముడి ఆలయం పేరుతోనే ఫేక్ అకౌంటా ?


భద్రాద్రి రామాలయం పేరుతో ఫేస్‌బుక్‌లో ఇటీవల ఓ అకౌంట్ క్రియేట్ అయింది. ఎవరైనా రాములవారి ఆలయ సమాచారాన్ని తెలుసుకోవాలంటే.. ఎక్కువగా సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్న కాలం ఇది. ఇలాంటి సమయంలో భద్రాద్రి రాముని ఆలయం పేరు మీద క్రియేట్ అయిన అకౌంట్‌లో ఆ వివరాలు లేకపోగా.. పోర్న్ సైట్ లింక్స్ తో పాటు , అసభ్య కరమైన మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఈనెల 5వ తేదీ నుండి  ఫేస్బుక్ అకౌంట్ లో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేయడం వాటిని సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడం తో   భక్తులు గుర్తించారు.   ఈ విషయాన్ని ఆలయ అధికారులకు చేరవేయడంతో పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు . అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


సైబర్ నేరస్తుడి గుట్టు బయటకు లాగుతున్న సైబర్ క్రైమ్ నిపుణులు 


భద్రాద్రి అధికారులు ఐటీ నిపుణుల సాయంతో భద్రాద్రి రామాలయం పేరుతో ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్‌ను  హోల్డ్ చేసినా కూడా తిరిగి గంటలోనే  అకౌంట్ లో మళ్లీ పోస్టింగ్స్ దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ అధికారులు అసలు ఈ చర్యలకు పాల్పడుతున్న వారు ఎవరా అని ఆరా తీస్తున్నారు. టెక్నికల్ అంశాలపై ఇప్పటికే వివరాలు సేకరించినట్లుగా కనిపిస్తోంది.  ఐపీ అడ్రస్ అధారంగా ఆ సైబర్ నేరగాడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 


పోకిరి పనా ? హిందువుల మనోభావాలు దెబ్బ తీసే కుట్రనా ?


 ఎవరైనా పోకిరీలు కావాలని చేస్తున్నారా లేక...  హిందూవులు  మనోభావాలను దెబ్బ తీయడానికి ,   మతసామరస్యాన్నికి విఘాతం కలిగించేలా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారా అన్నదానిపై క్లారిటీ లేదు.అసలు నిందితుడ్ని పట్టుకున్న తర్వాత పోలీసులు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.