Guntur Crime News :   బాపట్ల జిల్లా  చెరుకుపల్లి మండలం రాజవోలులో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ ను పెట్రోల్ పోసి కాల్చి చంపిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన సోదరిని వేధిస్తున్నారని.. ప్రశ్నించినందుకు అతనిపై పాము వెంకటేశ్వరర్ రెడ్డి అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించారని మరణ వాంగ్మూలంలో విద్యార్థి అమర్నాథ్ గౌడ్ తెలిపారు. మరణవాంగ్మూలం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై  బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ కీలక విషయాలను వెల్లడించారు.  పదో తరగతి చదువే విద్యార్థి అమర్నాథ్‌ను పెట్రోల్ పోసి నిప్పు అంటించి చంపారని ప్రకటించారు. 


హత్య కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేశామన్న బాపట్ల ఎస్పీ                         


పదో తరగతి విద్యార్థి  హత్యపై  కేసు నమోదు చేశామని, ఈ ఘటనలో నలుగురు పాల్గొన్నారని ఎస్పీ ప్రకటించారు.  ప్రధాన నిందితుడు పాము వెంకటేశ్వరరెడ్డితో పాటు మరో ముగ్గురు కూడా ఈ హత్యలు పాల్గొన్నారన్నారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని ఎస్పీ చెప్పారు. అమర్నాథ్ సోదరిని వెంకటేశ్వర రెడ్డి వేదిస్తున్నాడని, ఈ విషయం తెలుసుకున్న అమర్నాథ్.. తన సోదరిని వేధిస్తున్నట్లు అందరికీ చెప్పారని  వెంకటేశ్వర రెడ్డి ఆగ్రహించాడన్నారు. కక్ష పెంచుకుని అమర్నాథ్‌ను చంపడానికి కుట్ర చేశాడని ఎస్పీ తెలిపారు.  ఈ ఘటనలో రాజకీయ కోణం ఏమీ లేదని, వ్యక్తిగతంగా జరిగిన ఘటన మాత్రమేనన్నారు. దీనికి రాజకీయ రంగు పులమొద్దని ఎస్పీ ిజ్ఞప్తి చేశారు.  గతంలో ఈ గొడవకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు లేదని, ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే అనుమానితులను అరెస్టు చేశామన్నారు. క్లూస్ టీం రెండు సార్లు ఘటనా స్థలాన్ని పరిశీలించిందని ఎస్పీ తెలిపారు.


సోదరిని వేధిస్తున్న అంశాన్ని ప్రశ్నించినందుకు దారుణ హత్య                           


శుక్రవారం  విద్యార్థి అమర్నాథ్‌ను పాము వెంకటేశ్వర రెడ్డి, మరో ముగ్గురు యువకులు కలిసి దారుణంగా హత్య చేశారు. ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. విద్యార్థి హాహాకారాలతో స్థానికులు అక్కడకు చేరుకుని మంటలు ఆర్పి వేసి విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన విద్యార్థి మృతి చెందాడు. తన అక్కను వేధించడంపై ప్రశ్నించినందుకు అమర్నాథ్‌ను నిందితులు ఇంత దారుణంగా హత్య చేశారు. తనను ప్రశ్నించడంపై ఆగ్రహంతో స్నేహితులతో కలసి పాము వెంకటేశ్వర రెడ్డి... అమర్నాథ్‌ను పెట్రోలు పోసి తగలబెట్టాడు. 


రాజ్యసభ సభ్యుడు మోపిదేవి సాయాన్ని తిరస్కరించి  పంపేసిన బాధితులు                        


పాము వెంకటేశ్వరరెడ్డి తాపీ పని చేస్తాడని చెబుతున్నారు. ఆయన గ్రామంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులతో కలిసి తిరుగుతూంటారు. వారి అండతోనే ఇలా నేరాలకు తెగబుడుతున్నారన్న  ఆరోపణలు వస్తున్నాయి. బాలుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను .. గ్రామస్తులు వెనక్కి పంపేశారు. ఆయన ఇస్తామన్న రూ. లక్ష సాయం వద్దని చెప్పి వెళ్లిపొమ్మన్నారు. దీంతో ఆయన వెళ్లిపోయారు.