Teacher dies in court before sentenced prison for killing wife: అక్కడ కోర్టులో జడ్జి తన తీర్పును చదువుతున్నారు. నిందితుడు చేసిన నేరం నిరూపితమయింది. ఆయనకు శిక్ష విధించబోతున్నారు. కానీ అప్పుడే నిందితుడు ఆ అవసరం లేకుండా కన్ను మూశాడు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్నాడా.. లేకపోతే సహజంగా చనిపోయాడా అన్నది తేలాల్సి ఉంది.            

అమెరికాలోని టెక్సాస్‌లోని హ్యూస్టన్ కోర్టులో ఒక మాజీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, భార్యను హత్య చేసినందుకు 35 ఏళ్ల జైలు శిక్ష విధించబోయే ముందు మరణించాడు. జేమ్స్ పాల్ ఆండర్సన్ (39) అనే ఈ వ్యక్తి, 2023లో తన 34 ఏళ్ల భార్య విక్టోరియా ఆండర్సన్‌ను  కాల్చి హత్య చేసినట్లుగా గుర్తించారు. అతనిపై నేరాభియోగాలు మోపారు. విచారణలో నేరం నిరూపితమయింది. కానీ శిక్ష విధించే సమయంలో కోర్టులోనే చనిపోయాడు.  

జేమ్స్ ఆండర్సన్, క్లీవ్‌ల్యాండ్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేసేశాడు. 2023 సెప్టెంబర్‌లో, అతను తన భార్య విక్టోరియాను గొడవలో  హత్య చేశాడు. ఈ ఘటన సమయంలో, విక్టోరియా 911కు కాల్ చేసి సహాయం కోరింది, కానీ కాల్ మధ్యలోనే కాల్పుల శబ్దాలు వినిపించాయి.  పోలీసులు అక్కడకు చేరుకున్న తర్వాత జేమ్స్ లొంగిపోయాడు. జేమ్స్‌ను అరెస్ట్ చేసిన తర్వాత కొన్నాల్లకు  300,000 లక్షల డాలర్ల బాండ్ సమర్పించి బయటకు వచ్చాడు.  నేరం నిరూపితం కావడంతో అతను హ్యూస్టన్ క్రిమినల్ జస్టిస్ సెంటర్‌లోని 208వ జిల్లా కోర్టులో 35 ఏళ్ల జైలు శిక్షకు ఒప్పుకునే ప్లీ డీల్‌ను స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. అయితే, కోర్టు ప్రారంభమవుతున్న సమయంలో, అతను అకస్మాత్తుగా  కుప్పకూలిపోయాడు.                                    

హ్యారిస్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీస్ ఆఫీస్ ప్రకారం, జేమ్స్ కోర్టులోకి వచ్చిన తర్వాత కొన్ని నిమిషాలలోనే అతను మెడికల్ ఎమర్జెన్సీని ఎదుర్కొన్నాడు. వెంటనే అతనికి ప్రాథమిక చికిత్స చేసినప్పటికీ  ఆరోగ్యం మరింత విషమించింది. హ్యూస్టన్ ఫైర్ డిపార్ట్‌మెంట్ అతన్ని బెన్ టాబ్ హాస్పిటల్‌కు తరలించింది. అక్కడ అతను మరణించాడు.                         

ఈ పరిణామం కారణంగా, జడ్జి కోర్టు గదిని క్లియర్ చేసి, దానిని సాధ్యమైన క్రైమ్ సీన్‌గా ప్రకటించారు. సాక్షుల ప్రకారం, జేమ్స్ తన న్యాయవాదితో మాట్లాడిన తర్వాత, కొన్ని నిమిషాలు ఒంటరిగా ఉండాలని కోరాడు. ఆ సమయంలో అతను ఏదో తినడం వల్ల వాంతులు చేసుకున్నట్లుగా గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా.. లేకపోతే సహజంగానే చనిపోయాడా అన్నదాన్ని వైద్యులు తేల్చనున్నారు.