గోదావరి జిల్లాలో పులసకు ఉన్న క్రేజ్ ఎంటో అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఇంచుమించు ఈ సీజన్‌లో అంతే క్రేజ్ ఉన్న గోదావరి వంటకం చీరమేను..చీరతో వేటాడే ఈ చేపపిల్లల టేస్ట్ గురించి మాంస ప్రియులు చాలా గొప్పగా చెబుతారు.. గోదావరిలో లభ్యమయ్యే ఈ చీరమేను రేటు కూడా అంతే స్థాయిలో కూడా ఉంటుంది.. ఎందుకంటే ఇది అరుదుగా దొరికే సీజనల్ చీరమేను కావడం దీనికి ప్రధాన కారణం కూడా.. పూర్వ కాలంలో శేరు, తవ్వ, సోల కింద కొలిచి అమ్మే ఈ చీరమేను ఇప్పడు కిలోల లెక్కన అమ్మకాలు సాగిస్తున్నారు.. ఒక కిలో చీరమేను రూ.3000 నుంచి రూ.4000 వరకు విక్రయాలు జరుగుతుండగా పావుకిలో చొప్పున కూడా అమ్మకాలు చేస్తుంటారు స్థానికంగా ఉన్న మత్స్యకారులు.. తాజాగా చీరమేను సీజన్ కావడంతో పుదుచ్చేరీ యానం మార్కెట్‌లో చీరమేను ను కొనేందుకు ఎగబడుతున్నారు నాన్ విజిటేరియన్స్...
అసలు చీరమేను అంటే తెలుసా...
గోదావరిలో సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్ మాసాల్లో చీరమేను అరుదుగా దొరుకుతుంది కాబట్టే దీనికి ఇంత ధర పలుకుతుందంటుంటారు చీరమేను గురించి తెలిసిన వారు.. గోదావరి ప్రవాహం ఓ వైపు, గోదావరిపై వీచే శీతల చల్లగాలులు మరోవైపు ఈ ప్రభావానికి దొందు జాతికి చెందిన చేపపిల్లలు సమూహంగా నీటి ఉపరితలంపై నురగలా తేలుతూ కదులుతుంటాయి.. నీటి అలల తాకిడికి నురగ కూడా తోడవ్వడంతో ఈసమాహాన్ని గుర్తించడం మత్స్యకారులకు చాలా తేలిక అవుతుంది.
ఈ సమూహం కదలికను ముగ్గురు కలిసి చీరతో అడ్డుకుని పట్టుకుంటారు.. ఇది గట్టుపైకి తీసుకువచ్చి నీళ్లల్లో కడిగి బకెట్లలో ఉంచుతారు.. వలకు చిక్కని చిన్న చేపపిల్లలు కావడం, సమూహంగా కదలడంతో వలకు చిక్కవు గనుక ఈ చేపపిల్లలను చీరతో మాత్రమే పట్టుకునేందుకు వీలవుతుంది.. అందుకే వీటికి చీరమేను అనే పేరు వచ్చిందంటారు.. అయితే ఇప్పడు సీడ్ నెట్ అందుబాటులో ఉండడంతో వీటితోనే చీరమేనును పట్టుకుంటున్నారు.
ఈ రెసిపీలో తింటే ఆ రుచే వేరబ్బా...
గోదావరిలో అరుదుగా దొరికే ఈ సీజనల్ చీరమేను కోసం మాంస ప్రియులు ఎందుకు అంతగా ఎగబడతారు అంటే వీటితో చేసిన వంటకాలు అంత రుచిగా ఉంటాయని చెబుతుంటారు.. చీరమేను చింతకాయ పులుసు, చీరమేను మసాలా కూర, చీరమేనుతో కలిపి వేసిన గారెలు అబ్బో ఆ టేస్టే వేరే లెవెల్ అంటుంటారు గోదావరి ప్రజలు.. ప్రస్తుతం చీరమేను యానాం చేపలమార్కెట్‌లో దొరుకుతోంది.. ధవళేశ్వరం, అంతర్వేది, ఓడలరేవు ఇలా చాలా ప్రాంతాల్లో ఈ చీరమేను లభ్యం అవుతోంది.. కొంతమంది కిలోల లెక్కన విక్రయాలు చేస్తుండగా కొంత మంది కొలతల ప్రకారం అంటే శేరు, తవ్వ, సోల ప్రకారం కొలిచి అమ్ముతున్నారు. ఇక రోజూ జరిగే యానాం చేపల మార్కెట్‌లో నిర్వహించే వేలంపాటలో ఓ బకెట్ చీరమేను రూ.26 వేలు నుంచి రూ.28 వేలు వరకు ధర పలుకుతుండడం విశేషం.. ఇక్కడి నుంచి విదేశాలకు సైతం ప్యాక్‌చేయించుకుని తీసుకెళ్తున్నారు మాంస ప్రియులు..