Railway Track Suicide Rajkumar:   తీవ్ర సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా షాబాద్ వరుస హత్యల కేసులో  నిందితుడైన పార్వతి రాజ్‌కుమార్ ఉదంతం విషాదాంతమైంది. ఆరుగురిని అతి దారుణంగా నరికి చంపిన అనంతరం పరారైన ఈ నరహంతకుడు చివరకు  ఆత్మహత్య చేసుకున్నారు.  లొంగిపోవడం ఇష్టం లేక, పోలీసుల వేట నుంచి తప్పించుకోలేక రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నా ధైర్యం చాలక వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతని కోసం వెదుకుతున్న సమయంలో కొత్తూరు వద్ద ఓ వెంచర్ లో అతని మృతదేహం లభ్యమయింది . విషం తీసుకుని చనిపోయినట్లుగా గుర్తించారు. మృతదేహం పక్కన విషం బాటిల్ ఉంది. 

Continues below advertisement

ఆరుగుర్ని చంపేసిన రాజ్ కుమార్ 

 షాబాద్ మండలానికి చెందిన 35 ఏళ్ల రాజ్‌కుమార్‌పై గతంలో ఓ 17 ఏళ్ల మైనర్ బాలికను వేధించినందుకు గానూ పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన రాజ్‌కుమార్, తనపై కేసు పెట్టిన వారిపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అత్యంత క్రూరమైన ప్రతీకార ప్రణాళికతో ఒకే రాత్రి  ఆ బాలిక కుటుంబంతో పాటు తన కుటుంబాన్ని కూడా   ఊచకోత కోశాడు.

Continues below advertisement

నిందితుడు మొదట షాబాద్ పట్టణంలోని పీఆర్ఆర్ స్టేడియం సమీపంలో ఉన్న సదరు మైనర్ బాలిక ఇంటిపై దాడి చేశాడు. బాలికను బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా.. అడ్డువచ్చిన ఆమె తల్లి, నాయనమ్మలను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఆ బాలికను అఖిల్ సాగర్ చెరువు సమీపంలోకి తీసుకెళ్లి పీక కోసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘాతుకం ముగిసిన వెంటనే తన సొంత గ్రామానికి కార్లో ప్రయాణమై.. ఇంట్లో నిద్రిస్తున్న తన భార్య సరిత  , తన ఇద్దరు కన్నబిడ్డలు గొంతులు కోసి అత్యంత పాశవికంగా చంపేశాడు. 

రైలు కిందపడి చనిపోవాలని ప్రయత్నం చేసి చివరికి విషం తాగిన రాజ్ కుమార్ 

ఆరుగురిని పొట్టనబెట్టుకున్న అనంతరం రాజ్‌కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి నేను అందరినీ చంపేశాను"  అని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఉదంతం వెలుగుచూడటంతో తెలంగాణ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆధ్వర్యంలో నిందితుడి కోసం రూ. 2 లక్షల రివార్డు ప్రకటించి, దాదాపు 14 ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులు ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోనందుకు గానూ షాబాద్ ఎస్సై రమేష్‌ను కలెక్టర్ సస్పెండ్ కూడా చేశారు.

పోలీసుల వేట తీవ్రమవడంతో రాజ్‌కుమార్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. చేగూరు రైల్వే ట్రాక్ సమీపంలో నిందితుడు అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి. మొదట ఆత్మహత్యకు వెనకడుగు వేసినప్పటికీ, తప్పించుకునే దారి లేకపోవడంతో చివరకు  విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణమైన సైకో కిల్లర్ అంతం కావడంతో కేసు ముగిసినప్పటికీ.. కన్నపాపలు, మహిళలతో సహా ఆరుగురు అమాయకులు బలవడటం ఆయా గ్రామాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.