Telangana Police Case Against Allu Arjun Team: పుష్ప 2 రిలీజ్ (Pushpa 2) బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ (Sandhya Theater) వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. బాలుడు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ టీంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు వస్తోన్న నేపథ్యంలో భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ వస్తున్నారన్న సమాచారాన్ని సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని ఆయన టీంపై కేసు నమోదు చేశారు.


'బాధ్యులపై కఠిన చర్యలు'


బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. 'హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో బుధవారం రాత్రి 9:40 గంటలకు పుష్ప - 2 ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానులతో పాటు కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం మాకు లేదు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా తొలుత సమాచారం ఇవ్వలేదు. దానికి తోడు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. క్రౌడ్ అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు. రాత్రి 9:40 గంటలకు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చారు.


దీంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. అప్పటికే థియేటర్ లోపల, బయట ప్రేక్షకులతో నిండిపోయింది. ఆ టైంలో భద్రతా సిబ్బంది జనాన్ని అదుపు చేసే క్రమంలో నెట్టేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తోపులాట చోటు చేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కింద పడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండడంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించిన పోలీస్ సిబ్బంది బయటకు లాగారు. రేవతితో పాటు కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సీపీఆర్ చేసి దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి శ్రీతేజను మరో ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని స్పష్టం చేశారు.


ఈ ఘటనలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ బిడ్డ అల్లు అర్జున్ ఫ్యాన్ అని అతని కోరిక మేరకే సినిమాకు వచ్చామని బాలుడి తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు. అటు, ఈ ఘటనపై స్పందించిన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దీనిపై విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేసింది.


Also Read: Pushpa 2 Stampede: 'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి