Mulugu Encounter: 2027 నాటికి మావోయిస్టు పార్టీని దేశం నుంచి తుదముట్టించడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు ప్రకటించగా.. మీ ఆపరేషన్ కాగర్‌ను అడ్డుకోవడమే మా లక్ష్యం అనేలా మావోయిస్టులు వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అంటే మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో యుద్ధం నడుస్తోందనే చెప్పాలి. నిత్యం తుపాకుల మోతలు, పేలుడు పదార్థాల చప్పుళ్లతో అటవీ గ్రామాలు గుడారాల్లో వణికిపోతున్నాయి. పచ్చని అడవిలో రక్తపు వర్షం కురుస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇలాంటి భయానక పరిస్థితి నెలకొంది.
తాజాగా నేడు తెలంగాణలో మావోయిస్టుల ఎన్ కౌంటర్ కలకలం రేపింది. ములుగు జిల్లాకు చెందిన ఏటూరునాగారంలో చల్పాక అడవుల్లో గ్రేహౌండ్స్ దళాలకు.. మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువైపుల నుంచి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఇంకా ఎవరైన మావోయిస్టులు ఉన్నారో తెలుసుకునే పనిలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటిలో రెండు 2 ఏకే 47 రైఫిల్స్ ఉన్నట్లు తెలిసింది.
కీలక నేత హతం
దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చాలాసేపు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులను గ్రేహౌండ్స్ దళాలు హతమార్చాయి. తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను చేపట్టినట్లు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నట్లు సమాచారం. మరణించిన మావోయిస్టుల్లో ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్ పాపన్నతో పాటు అతడి దళానికి చెందిన సభ్యులు హతమైనట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న (35), ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు(43), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్(22), ముస్సకి జమున (23), జైసింగ్ (25), కిశోర్ (22), కామేశ్(23) ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మావోల అలజడి
కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్ల కదలికలు దాదాపు ఆగిపోయాయి. తెలంగాణకు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో మాత్రం మావోలు తమ కార్యకలాపాల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఐతే.. ఇటీవల తరచూ జరుగుతున్న అన్ని ఎన్‌కౌంటర్లలో భద్రతా బలగాలదే పై చేయి సాధిస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టు వ్యవస్థను పూర్తిగా రూపుమాపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసందే. అందుకోసం 2027 నాటికి ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ పరిస్థితుల్లో తాజాగా తెలంగాణలో నక్సలైట్లు తిరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. అసలు ములుగు జిల్లాలోకి మావోయిస్టులు ఎలా వచ్చారు?.. ఎందుకొచ్చారు? దట్టమైన అడవుల్లో వాళ్లు ఏం చేస్తున్నారు? భవిష్యతులో దేనికోసమైన ఏదైనా పెద్ద ప్లాన్ వేస్తున్నారా? పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నారా ? మొత్తం ఇంకా ఎంత మంది మావోయిస్టులు ఉన్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కూంబింగ్ తర్వాత గ్రేహౌండ్స్ బలగాలు చెప్పే విషయాన్ని బట్టి.. మావోల కదలికలపై ఓ అంచనాకు వచ్చే వీలుంటుంది.
Also Read : Maoist Encounter: ఇరవై ఏళ్లలో ఎంత మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ అయ్యారో తెలుసా?