Minister Gangula PRO Crime :  కరీంనగర్‌కు చెందిన  మంత్రి గంగుల కమలాకర్ పీఆర్వో పోలీస్ స్టేషన్, చట్టాలను అడ్డంగా పెట్టుకుని లంచాల వ్యాపారం చేస్తున్న వ్యవహారం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం అవుతోంది.  వాటర్ ప్లాంట్ కేసులో స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని  1 లక్ష డిమాండ్ చేసిన మంత్రి పిఆర్వో మల్లిఖార్జున్ ఆడియో వైరల్‌గా మారింది. 


వాటర్ ప్లాంట్లపై దాడులు చేసి కేసులు పెట్టిన పోలీసులు


ఇటీవల   కరీంనగర్  సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు  నగర వ్యాప్తంగా పలు వాటర్ ప్లాంట్ల పై పోలీసులు మెరుపు దాడి చేసి, నాణ్యత ప్రమాణాలు పాటించని పలు ప్లాంట్ల పై కేసులు నమోదు చేశారు. దానిలో భాగంగా సుభాష్ నగర్ లోని ఓ ప్లాంట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు .. పోలీసు కేసుకు భయపడి సదరు వాటర్ ప్లాంట్ యజమాని  మంత్రి గంగుల పిఆర్వో బోనాల మల్లిఖార్జున్ ను ఆశ్రయించాడు.   పోలీసు కేసు లేకుండా చూడాలని స్టేషన్ బెయిల్ ఇప్పించాలని వేడుకున్నాడు. 


కేసు మాఫి, స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని వాటర్ ప్లాంట్ యజమానులతో మంత్రి పీఆర్వో బేరాలు


ఇదే అదనుగా మంత్రి పీఆర్వో మల్లిఖార్జున్ బేరాలు ప్రారంభించాడు.  సిఐ ,ఏసీపీ తనకు దగ్గరని ..స్టేషన్ బెయిల్ తో పాటు నాలుగు రోజుల్లో కేసు కూడా  లేకుండా చూస్తానని హామీ ఇచ్చాడు.  ఇపుడే ఏసీపీ గారితో మాట్లాడానని కూడా హామీ ఇచ్చాడు. అయితే ఇదంతా ఉచిత సేవ కాదని..   వాళ్లు డబ్బులు తీసుకుంటారని  సుమారు 1 లక్ష వరకు అవుతుందని
తెలిపాడు. త్వరగా డబ్బులు తీసుకుని రా అంటూ ఆర్డర్ వేసాడు. ఈ  విషయాన్ని ఎవరకు చెప్పొద్దు. ఏసీపీ తో మాట్లాడిన ,అమౌంట్ కూడా మాట్లాడినా...ఎవరికైనా చెబితే పోలీసులు బద్నాం   అవుతారు అంటూ  సదరు వాటర్ ప్లాంట్ యజమానికి చెప్పాడు. 


పీఆర్వో ఆడియో లీక్‌తో కలకలం


అదే ఆడియోలో ఒకసారి పోలీస్ స్టేషన్ కు రావాలని సదరు వాటర్ ప్లాంట్ యజమాని మంత్రి పీఆర్వోను వేడుకున్నారు. అయితే మంత్రి పిఆర్వో  మాత్రం  నాపేరు చెప్పు అని భరోసా ఇచ్చారు. మంత్రి పీఆర్వోను కాబట్టి... వాళ్ళు నా దగ్గరకు రావాలి...నేను వాళ్ళ దగ్గరకు వెళ్తానా అని ప్రశ్నించారు.  నీవు వెళ్లి  మంత్రి పిఆర్వో మల్లిఖార్జున్  సార్ పంపించాడు అని చెప్పి కలువు.. నీ పని ఐపోతది స్టేషన్ బెయిల్ వస్తుంది..   నాలుగు రోజుల్లో కేసు లేకుండా చేస్తానని భరోసా ఇచ్చి పంపించాడు. డబ్బులు ఎక్కడకు తీసుకు రావాలో కూడా ఆడియోలో ఉంది. 


ఈ ఆడియో వ్యవహారం కరీంనగర్ పోలీసుల్లో కూడా కలకలం రేపుతోంది. పోలీసుల ప్రమేయంతోనే మంత్రి పీఆర్వో లంచాలు అడుగుతున్నాడా లేక సొంతంగా ఈ వ్యవహారం నడుపుతున్నాడా అన్నది తేలాల్సి ఉంది.