తెలంగాణ జగిత్యాల టీఆర్ నగర్ లో సంచలనం రేపిన తండ్రి, ఇద్దరు కొడుకుల హత్య కేసులో 6గురి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 20న మంత్రాల నెపంతో జగన్నాథం నాగేశ్వరరావు అతని కుమారులు రాంబాబు, రమేష్ లను హత్య చేశారు కాలనీ వాసులు. నిందితుల నుంచి రూ. 9,42,770 నగదు, 6  కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 24 మందిపై కేసు నమోదు చేశామని, అందులో ఆరుగురుని  అరెస్ట్ చేశామని డీఎస్పీ ప్రకాష్ తెలిపారు. 


జగిత్యాల టీఆర్‌నగర్‌ హత్యలు 


రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన చేతబడి అనుమాన హత్యల విషయంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. తండ్రి, ఇద్దరు కుమారుల దారుణ హత్యకు గురి కావడంతో పోలీసుల భద్రత మధ్య ముగ్గురి అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. అయితే అంత్యక్రియలకు గ్రామస్తులు హాజరు కాలేదు. తమను సైతం చంపుతారనే భయంతో నాగేశ్వరరావు మరో ఇద్దరు కుమారులు అంత్యక్రియల్లో పాల్గొనకుండా వారి బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు.


Also Read: నిండు గర్భిణీపై కత్తితో దాడి... గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారయత్నం చేశాడని డ్రామా... అనుమానంతో భర్తే ఘాతుకం


భయంతో అంత్యక్రియలకు హాజరుకాని కుమారులు


జగిత్యాల టీఆర్‌నగర్‌ లో గురువారం రోజున గ్రామానికి చెందిన జగన్నాథం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కొడుకులు రాంబాబు, రమేశ్‌ను అదే కాలనీకి చెందిన కొందరు చేతబడి అనుమానంతో కత్తులు, బరిసెలతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసులో 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాలకు శుక్రవారం  పోస్ట్‌మార్టం నిర్వహించి పోలీసుల భద్రత మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అంత్యక్రియలకు కాలనీ వాసులు గానీ, గ్రామస్థులు గానీ ఒకరు కూడా హాజరు కాలేదు. అతని బంధువులే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉంటే గ్రామంలో మంత్రాలపై మూఢ నమ్మకాలు విపరీతంగా ఉన్నాయి. చంపిన వర్గానికి చెందిన వారంతా నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా ఉన్నారు. తామంతా కలిసే నిర్ణయం తీసుకుని చంపామని పోలీసుల ముందే కాలనీ వాసులు ఏ మాత్రం భయం లేకుండా తెలిపారు. మిగిలిన వారిని సైతం హత మారుస్తామని హత్య చేసిన నిందితుల కుటుంబాలకు చెందిన మహిళలు అంటున్నారు. 


అధిక వడ్డీలు, మూఢనమ్మకాలు


అయితే నాగేశ్వరరావు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చే వాడు. దీనికి తోడు గ్రామంలో ఎవరు చనిపోయినా అతను మంత్రాలు చేస్తేనే చనిపోతున్నారని చేతబడితోనే అనారోగ్యానికి లోనవుతున్నామని గత కొంతకాలంగా కాలనీ వాసులు బలంగా నమ్ముతున్నారు.  దీంతో స్థానికులు నాగేశ్వరరావు కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో గత నెలలో సిరిసిల్ల సమీపంలో అతన్ని హత్యచేసేందుకు  విఫలయత్నం జరిగింది. కారుపై దాడి చేయగా తండ్రి, ఇద్దరు  కొడుకులు తప్పించుకున్నారు. అయితే గ్రామంలో ఆ వర్గానికి చెందిన 40 కుటుంబాలు ఉండగా నాగేశ్వరరావు వర్గం మాత్రం ఒకవైపు ఉండగా మిగతా వారు అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే పథకం ప్రకారం హత్య చేసినట్లు స్థానికులు అంటున్నారు. 


Also Read: బైక్ వెనక చక్రంలో ఇరుక్కొని మూడు నెలల పసికందు మృతి