Jagtial Crime News: తెలంగాణలోని జగిత్యాల జిల్లా (Jagtial News)లో దారుణం జరిగింది. భూమి విషయంలో జరిగిన గొడవ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల హత్యకు (Brothers Murder) కారణమైంది. గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. హృదయాలను కదిలించి వేసే ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం (Buggaram Mandal News) గోపులాపూర్ గ్రామంలో జరిగింది.
స్థానిక ఎస్సై శ్రీధర్ రెడ్డి వివరాల మేరకు.. బుగ్గారం మండలం గోపులాపూర్‌లో దివిటి శ్రీనివాస్ నివాసం ఉంటున్నారు. ఆయన రెండేళ్ల క్రితం తన ఇంటి పక్కనే మరో ఇంటిని కొనుగోలు చేశాడు. దాని పక్కనే అదే గ్రామానికి చెందిన బుర్రా నవీన్ (Burra Naveen) ఇల్లు సైతం ఉంది. కొత్తగా కొనుగోలు చేసిన ఇంటికి దారి విషయంలో నవీన్, శ్రీనివాస్‌కు తరచూ వాగ్వాదాలు, గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో శ్రీనివాస్, నవీన్ కుటుంబాల మధ్య గురువారం రాత్రి గొడవ జరిగింది. స్థానికులు కలగజేసుకుని నచ్చజెప్పడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. అనంతరం శ్రీనివాస్ తన పెదనాన్న కుమారుడు మహేష్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటుండగా నవీన్ కొంతమంది యువకులతో అక్కడికి వచ్చాడు. యువకులు ఒక్కసారిగా శ్రీనివాస్‌పై దాడి చేశాడు. మహేష్ వారిని అడ్డుకోవడానికి యత్నించగా అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహేష్‌కు కుమారుడు, భార్య ఉన్నారు. మృతుడు శ్రీనివాస్ సోదరి మమత ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న ఏఎస్పీ వినోద్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు.