Tamilnadu Crime News: ప్రజలకు మంచి చెప్పాల్సిన పోలీసే తప్పు చేస్తే... జనాలకు అవగాహన కల్పించి నేరాలకు దూరంగా ఉండాలని చెప్పాల్సిన ఖాకీ ఊచలు లెక్కిస్తోంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న వాడినే చంపేసిందో ఎస్సై. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. 


తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కల్లాలికి చెందిన 48 ఏళ్ల సెంథిల్ పోలీస్ కానిస్టేబుల్. ఇతని భార్య 44 ఏళ్ల చిత్ర సింగారపేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తున్నారు. అయితే సెంథిల్ ఈ ఏడాది సెప్టెంబర్ 16వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని ఆయన భార్య చిత్రనే పోలీసులకు తెలియజేసింది. ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం ప్రారంభించారు.


ఈ క్రమంలోనే తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని చిత్రనే.. కిరాయి ముఠాతో హత్యే చేయించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు చిత్రను అదుపులోకి తీసుకొని విచారించగా... ఆమె నేరం ఒప్పుకుంది దీంతో ఎస్ఐ చిత్రతో పాటు ఆమెకు సహకరించిన 32 ఏళ్ల మహిళా మంత్రగత్తె సరోజ, రౌడీలు విజయ్ కుమార్ (21), రాజ పాండ్యన్ (21)లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.


భార్యా పిల్లలను గొడ్డలితో నరికి చంపిన భర్త..!


పదిహేను రోజుల క్రితం తమిళనాడులో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్య, నలుగురు బిడ్డలను గొడ్డలితో నరికి చంపాడో కిరాతకుడు. తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన ఘటన జరిగింది. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న భర్తను నిలదీయడంతో మృగంలా మారిపోయిన భర్త ఇంట్లో ఉన్న గొడలితో నలుగురు పిల్లలను, భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపుతుంది. 


తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా ఓరంతవాడి గ్రామంలో పళనిస్వామి, వల్లీ అనే దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ సంతానం ఉన్నారు. అయితే కూలీ పనులు చేసుకుంటూ పళనీస్వామి కుటుంబాన్ని పోషిస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిసగా మారిన పళనీస్వామి కుటుంబాన్ని పట్టించుకోకుండా భాధ్యతారహితంగా వ్యవహరించేవాడు. ఈ క్రమంలో తరచూ పళనీస్వామికి, అతని భార్య వల్లీకి గొడవలు జరిగేవి. అయితే సోమవారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన పళనీస్వామితో వల్లీ గొడవకు దిగింది. దంపతులు ఇరువురు గొడపడ్డారు. ఆ సమయంలో ఇంట్లో చిన్నారులు నిద్రిస్తున్నారు. భార్యాభర్తల గొడప పెద్దదై  పళనీస్వామి ఇంట్లో ఉన్న గొడలితో నిద్రపోతున్న నలుగురు చిన్నారులను, భార్య వల్లీని హత మార్చాడు. తర్వాత పళనీస్వామి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఈ ఘటనను గమనించి స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే  సంఘటన స్థలంలో ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్న చిన్నారిని గుర్తించిన పోలిసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్ధితి విషమంగా ఉండడంతో తిరువణ్ణామలై వైద్య కళాశాలలో చిన్నారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.