Tamil Nadu Family Suicide :  కరోనా కారణంగా సామాన్యులు అప్పుల సుడిగుండంలో చిక్కుకున్నారు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతూ, కుటుంబ పోషణే భారంగా మారిన సమయంలో చేసిన అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి చేయడంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో కలకలం రేపింది. 


తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలోని శంకర్ నగర్ లో ప్రకాష్(41), గాయత్రి(39) దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే వీరికి నిత్యశ్రీ(13), హరికృష్ణ(9) సంతానం ఉన్నారు. ప్రకాష్ చెన్నైలో వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఎంతో హాయిగా సాగిపోయే వీరి జీవితాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేశాయి. కరోనా సమయంలో చాలా కాలం పాటు వ్యాపారం దెబ్బ తినడంతో కుటుంబ పోషణకు ప్రకాష్ అప్పు చేశాడు. చిన్న చిన్న వాటికి ఇరుగుపొరుగు వారి వద్ద అప్పు చేస్తూ కుటుంబ అవసరాలను తీర్చుకున్నాడు. ప్రకాష్ తల్లిదండ్రులు కరోనా భారిన పడడంతో అప్పు చేసి వారి చికిత్స అందించి కాపాడుకున్నాడు. ఇలా రోజు రోజుకీ ప్రకాష్ అప్పులు పెరుగుతూ వచ్చాయి. ఇలా చేసిన అప్పులకు భారీగానే వడ్డీ పెరిగింది. చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మరికొన్ని చోట్ల అప్పు చేయాల్సి వచ్చింది. ఇలా అప్పులు ప్రకాష్ కు తలకు మించిన భారంగా మారాయి. 


అప్పుల భారం 


వ్యాపారం కోసం ప్రకాష్ మరికొంత అప్పు చేశాడు. కానీ వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉండడం, అప్పుల ఇచ్చిన వ్యక్తుల వద్ద నుంచి ఒత్తిడి తట్టుకోలేని ప్రకాష్ కు ఏం చేయాలో అర్థం కాలేదు.  కొద్ది రోజుల పాటు బయట ప్రాంతాల్లో ఏదోక ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ, చేసిన అప్పులు తీర్చాలని భావించాడు. కానీ ప్రకాష్ అనుకున్న విధంగా ఉద్యోగం లభించకపోయే సరికి తీవ్రంగా మనోవేదనకు గురయ్యాడు. ఇంట్లోంచి బయటకు వెళ్తే అప్పులు ఇచ్చిన వారు ఎటువైపు నుంచి వచ్చి గొడవకు దిగుతారో అని ప్రకాష్ ఆవేదనకు గురై కొద్ది రోజులు చెన్నైలో తన తల్లిదండ్రులు వద్దకు వచ్చాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను మృతి చెందిన తరువాత తన కుటుంబంపై అప్పులు బాధ ఎక్కువ అవుతుందని భావించిన ప్రకాష్ వారిని కూడా చంపేయాలని భావించాడు. 


భార్య, బిడ్డల హత్య  


ముందుగా తన భార్య, బిడ్డలను చంపిన తరువాత తాను చనిపోవాలని భావించిన ప్రకాష్.. ఈ నెల 19వ తేదీన అమెజాన్ లో ఎలక్ట్రానిక్ రంపాన్ని ఆర్డర్ చేశాడు. ప్రకాష్ ఆర్డర్ చేసిన రంపం ఇంటికి వచ్చే వరకూ కుటుంబంతో ఎంతో సంతోషంగా గడిపాడు. అయితే గత రెండు రోజుల క్రితం ప్రకాష్ ఆర్డర్ చేసిన రంపం ఇంటికి చేరుకుంది. అయితే ఎలక్ట్రిక్ రంపాన్ని చూసిన గాయత్రి ఎందుకని అడిగింది. తన ఫ్రెండ్ కి అవసరం ఉండడంతో ఆర్డర్ చేసినట్లు చెప్పాడు. శుక్రవారం రాత్రి కుటుంబసభ్యులకు ఆహారంలో మత్తు మందు ఇచ్చాడు.‌ అందరూ మత్తులోకి వెళ్లడంతో ముందుగా భార్యను ఎలక్ట్రిక్ రంపంతో గొంతు కోసి చంపాడు. తరువాత కుమార్తె నిత్యశ్రీ, కుమారుడు హరికృష్ణని గొంతు కోసి హత్య చేశాడు. వారు చనిపోయారని నిర్ధారించుకుని ప్రకాష్ కూడా రంపంతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 


ఇంట్లో విగతజీవులై 


ప్రకాష్ తండ్రి ఫోన్ చేసినా ఎంతకీ ఫోన్ తీయకపోయే సరికి అనుమానం వచ్చి ఇంటికి వచ్చే చూశారు.  ఇంటి తలుపులు మూసి ఉండడంతో చుట్టు పక్కల వారి సహాయంతో తలుపులను బద్దలు కొట్టి చూసే సరికే కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు రక్తపు మడుగులో‌పడి ఉన్నారు. వారిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ శంకర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన మృతిదేహాలను చెన్నై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.‌