Tamil Nadu News: తమిళనాడు చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలోని చిత్రవాడి గ్రామంలో ఒళ్లు గగుర్పొడితే ఘటన జరిగింది. శ్మశానంలో పూడ్చి పెట్టిన బాలిక మృతదేహం తలను కొందరు దుండగులు తీసుకెళ్లారు. 10 రోజుల క్రితం పదేళ్ల బాలిక మృతి చెందగా.. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి సమీపంలోని శ్మశానంలో ఖననం చేశారు. ఆమె సమాధి నుండి తలను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్లు పోలీసులకు అక్టోబర్ 25వ తేదీన మంగళవారం సమాచారం అందింది. ఆ విషయం అలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల మిస్సింగ్ ఘటనపై పోలీసు అధికారులు విచారణ ప్రారంభించారు.
ఆరో తరగతి చదువుతున్న కృతిక అనే బాలిక ఈనెల 5వ తేదీన ఆడుకుంటూ తీవ్రంగా గాయపడింది. ఇంటి సమీపంలోనే ఆడుకుంటుండుగా పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం విరిగి ఆమెపై పడింది. తలకు, శరీరానికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. రక్తమోడుతున్న ఆ బాలికను స్థానికులు, తల్లిదండ్రులు హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. దాదాపు 9 రోజుల పాటు ఆసుపత్రిలో ఆ బాలిక ప్రాణాలతో పోరాడింది. చివరకు అక్టోబర్ 14వ తేదీన ప్రాణాలు వదిలింది.
10 రోజుల తర్వాత తల మాయం
చనిపోయిన బాలికకు ఆమె కుటుంబ సభ్యులు అక్టోబర్ 15వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. మధురాంతకం సమీపంలోని చిత్రవాడిలో ఉన్న శ్మశాన వాటికలో ఆ బాలిక మృతదేహాన్ని ఖననం చేశారు. 10 రోజుల తర్వాత స్థానికులు శ్మశానం మీదుగా వెళ్తుండగా.. ఓ సమాధిని ధ్వంసం చేసిన ఆనవాళ్లు గుర్తించారు. అక్కడే నిమ్మకాయ చెక్కలు, పసుపు, కుంకుమ, ఇతర క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయపడిపోయారు. వెంటనే ఆ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వచ్చి సమాధి ధ్వంసం కావడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాధి వద్ద క్షుద్రపూజల ఆనవాళ్లు
శ్మశానానికి చేరుకున్న పోలీసులు.. అక్కడి పరిస్థిత గమనించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, జిల్లా రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో పోలీసులు సమాధిని తెరిచి చూశారు. అందులోని బాలిక మృతదేహానికి తల లేకపోవడాన్ని గమనించి విస్తుపోయారు. ఆ బాలిక తల్లిదండ్రులు, బంధువులు, అక్కడి పెద్ద సంఖ్యలో చేరుకున్న గ్రామస్థులు కతల లేకపోవడాన్ని చూసి వణికిపోయారు. క్షుద్ర పూజలు చేసి బాలిక తలను తీసుకెళ్లినట్లు కనిపిస్తుండటం వారిని భయాందోళనకు గురి చేస్తోంది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చెంగల్ పట్టు జీఎంసీహెచ్ కు పంపిన అధికారులు, మృతదేహాన్ని పూడ్చి పెట్టిన తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహం తలను ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. క్షుద్రపూజలు చేసిన బాలిక తలను తీసుకెళ్లింది ఎవరు, ఎందుకు ఈ పని చేశారు, శత్రుత్వం కారణంగా ఇలా తలను ఎత్తుకెళ్లారా, లేదా చేతబడిలో భాగమా, లేదా ఇంకేదైనా కారణం ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. శ్మశానం సమీపంలో చేతి గ్లౌజ్ లు, టార్చ్ లైట్ ను, ఇతర వస్తువులను అధికారులు గుర్తించారు.