Chain Snatchers:
కోయంబత్తూర్
చైన్ స్నాచింగ్ కేసులు పోలీసులకు సవాలు విసురుతున్నాయి. కొన్ని ముఠాలను పట్టుకుంటున్నా...మళ్లీ ఎక్కడి నుంచో కొత్త ముఠాలు పుట్టుకొచ్చి చైన్ స్నాచింగ్‌కి పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో కొందరు బాధితులు హత్యకూ గురవుతున్నారు. మరి కొందరు తీవ్ర గాయాల పాలవుతున్నారు. చెన్నైలోని కోయంబత్తూర్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. 33 ఏళ్ల మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కార్‌లో వచ్చిన నిందితులు ఉన్నట్టుండి ఆమె గొలుసుని లాగేశారు. అది తెగేంత వరకూ ఆమెను అలా రోడ్డుపైనే లాక్కుంటూ తీసుకెళ్లారు. అయినా..వాళ్లతో పెనుగులాడి చైన్ కొట్టేయకుండా పోరాటం చేసింది బాధితురాలు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వెంటనే విచారణ చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. రోడ్డుపై నడిచి వస్తుండగా...కార్‌లో వచ్చిన నిందితులు కాస్త స్లో చేసి విండో మిర్రర్ కిందకు దించారు. చేతులు బయట పెట్టి ఠక్కున ఆమె చైన్‌పై చేయి వేసి లాగారు. కార్‌తో పాటు ఆమెని కొంత దూరం వరకూ లాక్కెళ్లి ఓ చోట ఆపారు. చైన్ చేతుల్లోకి రాకపోవటం వల్ల అక్కడి నుంచి వెంటనే పరారయ్యారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా కార్ నంబర్‌ని నోట్ చేసుకున్న పోలీసులు...ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులపై గతంలోనూ చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. వీరిలో ఒకరు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నారు.