Swiggy Delivery Boy Fraud In Hyderabad: ఫుడ్ నుంచి ఇంట్లో వాడుకునే వస్తువుల వరకూ అన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే సులభంగా దొరుకుతున్నాయి. చేతిలో మొబైల్ ఉంటే చాలు వస్తువులను తమకు నచ్చిన వారికి పంపించడం సహా ఇతరుల నుంచి వస్తువులను కూడా రిసీవ్ చేసుకోవచ్చు. కొందరు పాలు, కూరగాయల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకూ అన్నింటినీ ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తుంటారు. ఫుడ్‌తో పాటు వస్తువులను సైతం డెలివరీ చేస్తుండగా సేవలు మరింత సులభతరం అయ్యాయి. అయితే, టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆన్ లైన్ మోసాలు సైతం అలానే పెరుగుతున్నాయి. తాజాగా, డెలివరీ సర్వీసుకు సంబంధించి ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ల్యాప్ టాప్‌ను డెలివరీ సర్వీస్ ద్వారా మరో చోటుకి పంపించాలని చూస్తే.. సదరు డెలివరీ బాయ్ దాన్ని చేర్చాల్సిన చోటుకు చేర్చకుండా తిరిగి ఇవ్వాలంటే డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయాన్ని బాధితుని భార్య లింక్డ్‌ఇన్‌లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఏం జరిగిందంటే.?


బాధితులు సోషల్ మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ఓ వ్యక్తి మాదాపూర్‌లోని (Madhapur) ఓ ఆఫీస్ నుంచి మరో ఆఫీస్‌కు బ్యాక్ ప్యాక్‌లో ల్యాప్ టాప్ డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే స్విగ్గీ ప్యాకేజీ డెలివరీ సర్వీస్ Swiggy Genie సర్వీస్‌ను బుక్ చేసుకున్నారు. అనంతరం డెలివరీ పార్టనర్ బ్యాగ్ తీసుకున్నాడు. అయితే, ల్యాప్ టాప్ ఎంతకీ డెలివరీ కాకపోవడంతో బుక్ చేసిన వ్యక్తికి అనుమానం వచ్చి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. స్విగ్గీ కస్టమర్ కేర్‌కు కాల్ చేయగా.. వారు కూడా సదరు డెలివరీ బాయ్‌ను గుర్తించలేకపోయారు. 


కొద్దిసేపటి తర్వాత సదరు డెలివరీ బాయ్ వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. ల్యాప్ టాప్ కావాలంటే రూ.15 వేలు ఇవ్వాలని.. డబ్బులు పంపించిన వెంటనే ర్యాపిడో ద్వారా ల్యాప్ టాప్ తిరిగి ఇస్తానని పేర్కొన్నాడు. దీంతో షాకైన వ్యక్తి దీనిపై పోలీసులను ఆశ్రయించగా వారు విచారిస్తున్నారు. ఈ విషయాన్ని బాధిత వ్యక్తి భార్య లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.


Also Read: Crime News: జీడిమెట్లలో తీవ్ర విషాదం - ఇద్దరు పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య