Swiggy Agent Dies:


500 మీటర్ల వరకూ లాక్కెళ్లిన కార్..


ఢిల్లీలోని కంజావాలా హిట్ అండ్ రన్ కేస్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు అలాంటి ఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది. నోయిడాలో ఓ కార్‌ టూవీలర్‌ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న స్విగ్గీ ఏజెంట్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఢీకొట్టిన తరవాత దాదాపు 500 మీటర్ల వరకూ కార్‌..బైక్‌ని లాక్కెళ్లిందని పోలీసులు వెల్లడించారు. "స్విగ్గీ ఏజెంట్ కౌశల్...ఫుడ్ డెలివరీ కోసం బయటకు వచ్చాడు. నోయిడా సెక్టార్ 14 వద్ద ఓ కార్ వేగంగా వచ్చి ఢీకొట్టింది" అని వివరించారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం...బైక్..కార్‌కు చిక్కుకుంది. కొంత దూరం వరకూ కార్ డ్రైవర్ అలానే ముందుకు వెళ్లాడు. కార్‌లో బాధితుడు చిక్కుకున్నాడు. కాసేపయ్యాక ఉన్నట్టుండి
కింద పడిపోయాడు. అప్పుడు కానీ డ్రైవర్ కార్‌ ఆపలేదు. అప్పటికే కౌశల్ మృతి చెందాడు. మృతుని వయసు 24 ఏళ్లు అని పోలీసులు నిర్ధరించారు. అర్ధరాత్రి 1 గంటకు కౌశల్‌కు తన సోదరుడు కాల్ చేశాడు. అప్పటికే కౌశల్ ప్రాణాలు కోల్పోయాడు. యాక్సిడెంట్‌ స్పాట్‌లో ఉన్న ఓ వ్యక్తి కాల్ అటెండ్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. కాసేపటికి పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. "యాక్సిడెంట్ స్పాట్‌ పరిసరాల్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. నిందితుడిని పట్టుకుంటాం" అని పోలీసులు వెల్లడించారు. 


కంజావాలా కేసులోనూ ఇంతే..


ఇక దేశ రాజధానిలో ఢిల్లీని కంజావాలా కేసు అలజడి రేపుతోంది. స్కూటీని ఢీకొట్టి ఓ కార్‌ దాదాపు 13 కిలోమీటర్ల వరకూ అలా లాక్కుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో అంజలి సింగ్ అనే యువతి దారుణంగా చనిపోయింది. ఈ కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ఈ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నా...మొత్తం ఏడుగురికి ఈ ప్రమాదంతో సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు. అయితే...హత్య చేశారనటానికి ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా చూస్తే...అంజలి (మృతురాలు) ముందువైపు ఎడమ చక్రంలో ఇరుక్కుపోయింది. ఆమె రక్తపు మరకలు కూడా ఆ వీల్‌కే ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కార్ కింద భాగంలోనూ రక్తపు మరకలున్నట్టు ఫోరెన్సిక్  రిపోర్ట్ వెల్లడించింది. అయితే... అంజలికి,ఆమె బాయ్‌ఫ్రెండ్‌కి ఈ యాక్సిడెంట్‌కు ముందు ఓ హోటల్‌లో  వాగ్వాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తెలుసుకున్నారు పోలీసులు. అంజలి ఫ్రెండ్ నిధి కూడా ఈ విషయం చెప్పింది. పైగా...వాళ్లిద్దరి మధ్య జరిగిన ఘర్షణలోనే అంజలి ఫోన్‌ కింద పడి పగిలి పోయిందని కూడా వివరించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరి కొందరిని కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. కానీ...వారెవరు అన్న వివరాలు వెల్లడించలేదు. వాళ్లెవరు..? ఈ కేసుతో వాళ్లకున్న సంబంధం ఏంటి..? వాళ్లు నిధికి తెలిసిన వాళ్లా..? లేదంటే అంజలికి పరిచయస్థులా..? ఇలా ఎన్నో సందేహాలు కేసుని సంక్లిష్టం చేస్తున్నాయి. 


Also Read: US Utah Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం, 8 మంది మృతి