Students Falling Ill With Principal Punishment In Rampachodavaram: క్రమశిక్షణ పేరుతో ఓ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన మాట వినడం లేదని ఏకంగా 3 రోజుల పాటు వారితో ప్రతిరోజూ 100 నుంచి 200 గుంజీలు తీయించారు. వరుసగా నాలుగో రోజు కూడా అదే శిక్ష విధించడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ అమానవీయ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri District) రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసూన, పీడీ కృష్ణకుమారి తమ పట్ల దారుణంగా ప్రవర్తించారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చెప్పిన మాట వినడం లేదని.. క్రమశిక్షణ పేరుతో శుక్రవారం నుంచి ప్రతి రోజూ 100 నుంచి 200 వరకూ గుంజీలు తీయించారు. సోమవారం కూడా ఇలాగే చేయడంతో దాదాపు 50 మంది విద్యార్థినుల వరకూ కాళ్ల నొప్పులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. సాయంత్రానికి కొంతమంది కోలుకోగా వారిని డిశ్చార్జి చేశారు. మరికొంత మంది విద్యార్థినులు ఇంకా చికిత్స పొందుతున్నారు.
ఎమ్మెల్యే ఆగ్రహం
ఈ ఘటనపై ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థినులను గుంజీలు తీయించడం దారుణమని అన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలానికి సూచించారు. స్థానిక ఏరియా ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించి వారితో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదని.. తన సొంత డబ్బులతో తమకు భోజనం పెడుతున్నానని ప్రిన్సిపాల్ తమతో అంటున్నట్లు బాలికలు ఎమ్మెల్యే ఎదుట కంటతడి పెట్టారు. దీంతో వారిని ఓదార్చిన ఎమ్మెల్యే.. ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాలని భరోసా ఇచ్చారు.
మరోవైపు, తమ పిల్లలతో గుంజీలు తీయించడం పట్ల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్, పీడీలపై చర్యలు తీసుకోవాలని.. వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఈ ఘటనపై స్పందించాలని కోరుతున్నారు.
Also Read: Anna Canteens: ఈనెల 18న అనంతపురంలో మరికొన్ని అన్న క్యాంటీన్లు ప్రారంభం