శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. జి.సిగడాం మండలం మెట్టవలసలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. వీధిలో ఆడుకుంటున్న 18 నెలల చిన్నారిని వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని చికిత్స నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారికి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు రాంబాబు, రామలక్ష్మీ కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు.
ప్రమాదం మీద ప్రమాదం - ఈసారి కోతి రూపంలో చిన్నారిని కబలించిన మృత్యువు!
ఆ బాబు వయసు మూడేళ్లు. అతడు బుడ్డి బుడ్డి కాళ్లతో అడుగులు వేస్తుంటే, ముచ్చట్లు చెబుతుంటే మరిసిపోయారు ఆ తల్లిదండ్రులు. అయితే ఇటీవలే ఆ బాబు ఆడుకుంటూ వెళ్లి గడప తట్టుకొని కింద పడ్డాడు. పక్కనే ఉన్న కత్తి మెడకు గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసుకొని... కష్టపడి కుమారుడ్ని కాపాడుకున్నారు. ఆ గాయం పూర్తిగా మానకముందే.. ఈసారి వారికి కోలుకోలేని దెబ్బ తగిలింది. మరో సమస్య వచ్చి ఏకంగా బాబు ప్రాణాలు తీసింది. ఇంటిమీదకు కోతులు వచ్చి వీరంగం చేయగా.. ఓ బండరాయి కిందపడింది. అదే సమయంలో బాలుడు అక్కడే ఉండడంతో.. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తమ కళ్లెదుటే కుమారుడు చనిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆ మధ్య హైదరాబాద్ లోని అంబర్ పేట ఏరియాలో కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం పలు చోట్ల వీధి కుక్కల దాడుల ఘటనలు చూశాం. కొన్ని చోట్ల చిన్నారులతో పాటు పెద్దవారు సైతం కుక్కల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ లో ఇటీవల ఓ బాలుడిపై కుక్కలు దాడి చేయగా.. అతడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఇలాంటి ఎన్నో ఘటనలు బయటకు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కోచోట ఒక్కొక్కరూ గాయపడ్డారు. తాజాగా మెదక్ జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఏడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి.. వెంటనే బాలికను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పాప ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందుకుంటోంది.
సిద్ధిపేటలో డిప్యూటీ కలెక్టర్ పై దాడి..
సిద్దిపేట కలెక్టరేట్ క్వార్టర్స్ లో కుక్కలు బీభత్సం సృష్టించాయి. నగర శివారులో సిద్దిపేట కలెక్టరేట్ క్వార్టర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ జిల్లా పాలనాధికారితో పాటు అధికారులు కూడా నివాసాలు ఏర్పరుచుకున్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కూడా ఆ నివాసాల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి తన క్వార్టర్ ఆవరణలో నడుచుకుంటూ వెళ్తున్నారు. క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని ఎక్కడి నుంచో ఓ వీధి కుక్క వచ్చి గట్టిగా కరిచింది. శ్రీనివాస్ తప్పించుకునే ప్రయత్నం చేసినా ఆ కుక్క వదల్లేదు. ఈ క్రమంలోనే డిప్యూటీ కలెక్టర్ రెండు కాళ్లను కొరికేసింది. దీంతో డిప్యూటీ కలెక్టర్ గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది చేరుకొని కుక్కను తరిమారు. దీంతో డిప్యూటీ కలెక్టర్ కు ఎలాంటి హానీ జరగలేదు. కానీ రెండు కాళ్లు పిక్కల మధ్య కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. విపరీతమైన రక్త స్రావం కూడా అయింది. ఈ క్రమంలోనే సిబ్బంది హుటాహుటిన డిప్యూటీ కలెక్టర్ ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.