State level tennis player shot dead by father :   హర్యానాలోని గురుగ్రామ్‌లో   రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి  రాధికా యాదవ్ ను ఆమె తండ్రి కాల్చి  చంపారు.  గురుగ్రామ్‌లోని సెక్టార్ 57లోని ఇంట్లోనే ఈ ఘటన జరిగింది.  రాధికా యాదవ్ తండ్రి ఆమెపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.  రాధికాపై కాల్చిన మూడు బుల్లెట్లు ఆమె శరీరంలో గుండె, ఛాతీ,   కడుపు భాగాల్లో తగిలాయి.  తీవ్ర గాయాలతో ఉన్న రాధికను  సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి  ఇతర కుటుంబసభ్యులు తరలించారు.  చికిత్స పొందుతూ  ఆమె మరణించింది. పోలీసులు  రాధికా తండ్రిని అరెస్టు చేశారు. 

 రాధికా యాదవ్  హర్యానాకు  టెన్నిస్  రంగంలో మంచి ప్రతిభ చూపించే క్రీడాకారిణి.   ఆమె ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (AITA)లో రిజిస్టర్ అయ్యారు.  రాధికా యాదవ్ అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ (ITF) డబుల్స్‌లో 113వ ర్యాంక్‌ను సాధించింది, ఇది ఆమెను ప్రపంచంలోని టాప్ 200 డబుల్స్ క్రీడాకారులలో నిలిపింది.    ఆమె కెరీర్‌లో   గర్ల్స్ అండర్-18లో 75, మహిళల డబుల్స్‌లో 53,   మహిళల సింగిల్స్‌లో 35 ర్యాంకుల వరకూ వెళ్లారు.  సానియా మీర్జా తర్వాత గొప్ప క్రీడాకారిణిగా ఎదిగే సామర్థ్యం ఉన్నట్లు  టెన్నిస్ వర్గాలు అంచనా వేశాయి.  

రాధికాయాదవ్ ను ఎందుకు ఆమె  తండ్రి కాల్చి చంపారన్నదానిపై భిన్నమైన కథనాలు వస్తున్నాయి. రాధికా యాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడానికి బానిసైనట్లు ఆమె తండ్రి అసంతృప్తిగా ఉన్నాడని  అందుకే చంపేసి ఉంటాడని భావిస్తున్నారు. రీల్స్ విషయంలో ఆమె తండ్రితో  వాగ్వాదానికి  దిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు.  అయితే  హత్యకు ఖచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు,  దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులుచెబుతున్నారు.  ఈ హత్య వెనుక కుటుంబ సమస్యలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.