నక్షత్ర తాబేళ్లతో లక్ష్మీ కటాక్షం ఉంటుందని మాయమాటలు చెప్పి వ్యాపారం చేస్తున్న ఓ కేటుగాడు.. నెల్లూరు పోలీసులకు చిక్కాడు. తాబేళ్లను కొన్నవాళ్లకి లక్ష్మీకటాక్షం సంగతి పక్కనపెడితే.. వాటిని 400 రూపాయలకు కొని, 7వేల రూపాయలకు అమ్ముతూ.. ఆ వ్యాపారి మాత్రం నిజంగానే లక్ష్మీ కటాక్షం పొందుతున్నాడు. నక్షత్ర తాబేళ్లను స్మగ్లింగ్ చేస్తున్న ఇతను నేరస్తుడనుకుంటే పొరపాటే. పక్కా పోలీస్ ఆఫీసర్. చెన్నైలో స్పెషల్ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. పేరు సెల్వకుమార్. ఆవడిలో హెడ్ కానిస్టేబుల్ గా డ్యూటీ చేసే సెల్వకుమార్ ఓ ప్రైవేట్ అక్వేరియం కూడా నడుపుతున్నాడు. వివిధ రకాల చేపలు, అక్వేరియం సామగ్రిని మౌంట్ రోడ్డులోని ఓ షాపులో విక్రయిస్తుంటాడు. అయితే ఇతడికి మరో సైడ్ బిజినెస్ కూడా ఉంది. నక్షత్ర తాబేళ్లను అక్రమంగా తీసుకొచ్చి అమ్ముతుంటాడు. 




నక్షత్ర తాబేళ్లను ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం వస్తుందంటూ ప్రచారం చేసి తన వద్దకు వచ్చినవారికి మాయమాటలు చెప్పేవాడు. ఒక్కో తాబేలుని 2వేల నుంచి 7వేల రూపాయల వరకు బేరం పెట్టేవాడు. అసలా తాబేళ్లను ఒక్కోటి 400 రూపాయలకు వివిధ ప్రాంతాల్లో కొనుక్కుని తెచ్చేవాడు సెల్వ. పోలీస్ కావడంతో ఐడెంటిటీ కార్డ్ చూపించి ఎక్కడా చెకింగ్ లకు దొరక్కుండా తప్పించుకునేవాడు. కానీ నెల్లూరు జిల్లా సెబ్ పోలీసులు పక్కా ఇన్ఫర్మేషన్ తో సెల్వకుమార్ ని అరెస్ట్ చేశారు. తడ మండలం భీమునివారి పాలెం సెబ్‌ చెక్‌పోస్టు ఇన్‌ స్పెక్టర్‌ ప్రసాద్‌ తన బృందంతో వలపన్ని సెల్వకుమార్ ని పట్టుకున్నారు. 


మూడు నెలల క్రితం కూడా సెల్వకుమార్ ఇలాగే తాబేళ్లను నెల్లూరు జిల్లా మీదుగా తరలించాడు. తాజాగా రెండో దఫా ఇలా రవాణా చేస్తూ పోలీసులకు చిక్కాడు. ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన బైకిలాల్‌ అనే వ్యక్తి వద్ద 250 నక్షత్ర తాబేళ్లను కొనుగోలు చేశాడు సెల్వ కుమార్. అనంతరం అక్కడి నుంచి చెన్నై వెళ్లే కనిగిరి డిపో ఆర్టీసీ బస్సెక్కి బయల్దేరాడు. మార్గం మధ్యలో రాష్ట్ర సరిహద్దు తడ మండలం భీమునివారిపాలెం చెక్‌ పోస్టు వద్ద పోలీసు తనిఖీల్లో బుక్కయ్యాడు. సెబ్‌ ఇన్‌ స్పెక్టర్‌  ప్రసాద్‌ ఆధ్వర్యంలో సిబ్బంది బస్సుల్ని తనిఖీ చేస్తున్న క్రమంలో నక్షత్ర తాబేళ్లు బయటపడ్డాయి. సెల్వ కుమార్ అవి తనవి కావంటూ బుకాయించాడు. తనకే సంబంధం లేదని అన్నాడు. కానీ ఆ తర్వాత అవి తానే తీసుకెళ్తున్నానంటూ ఒప్పుకున్నాడు. తాను హెడ్‌ కానిస్టేబుల్‌ నంటూ ఐడీ కార్డు చూపించి వదిలేయాలన్నాడు. తాబేళ్లతోపాటు అతడిని అదుపులోకి తీసుకుని వెంకటగిరి ఎఫ్‌.ఆర్‌.ఓకి అప్పగించారు సెబ్ పోలీసులు. 


నక్షత్ర తాబేళ్లు ఉంటే ఇంటికి మంచిదని, డబ్బులు బాగా వస్తాయనే ప్రచారం ఉంది. దీంతో సముద్ర తీర ప్రాంతాల్లో అరుదుగా దొరికే నక్షత్ర తాబేళ్లను కొందరు సేకరిస్తున్నారు. స్మగ్లింగ్ ముఠాల ద్వారా వీటిని సరిహద్దులు దాటిస్తున్నారు. తమిళనాడులో వీటికి మంచి గిరాకీ ఉందని అంటున్నారు. ఆ డిమాండ్ ని క్యాష్ చేసుకోడానికి వాటిని చెన్నైకి తరలించి విక్రయిస్తున్నారు. వేల రూపాయల్లో వీటిని అమ్ముతున్నారు. సమద్ర తీరంలో ఒక్కో తాబేలుని 100 రూపాయలు ఇచ్చి మత్స్యకారుల నుంచి సేకరిస్తారు. ఆ తర్వాత వాటిని 500 వరకు స్థానిక వ్యాపారులు విక్రయిస్తారు. సరిహద్దులు దాటాక సైజుని బట్టి ఒక్కో తాబేలు రేటు 10 వేల రూపాయల వరకు ఉంటుంది.