Srikakulam Crime : ఆర్ఆర్ఆర్ సినిమా బెనిఫిట్ షో టికెట్ల వాగ్వాదం ఒకరి ప్రాణం తీసింది. శ్రీకాకుళం నగరంలోని గూనపాలెం వీధిలో డీఎస్పీ ఆఫీసుకు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం జిల్లావాసులు ఉలిక్కిపడుతున్నారు. ఈ ఘటనలో నిందితుడు, మృతుడు ఇద్దరు గూనపాలెంలోని ఒకే సచివాలయంలో వాలంటీర్లు. ఒకరు పేరు కరుణరాజ్, మరొకరు వరప్రసాద్ అలియాస్ అబ్బాస్. ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లకు సంబంధించి 24వ తేదీన ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. 24వ తేదీ రాత్రి కూడా అబ్బాస్ గ్యాంగ్ బైక్ లతో వీధిలో హాల్ చల్ చేయడం దానిని కరుణరాజ్ ఇది తప్పు అని చెప్పడం, గతంలో పాత కక్షలు కూడా ఒక కారణం అయింది. దాడి చేసిన వరప్రసాద్ అలియాస్ అబ్బాస్ పై గతంలో గంజాయి కేసులు, బైక్ కాల్చిన కేసు కూడా నమోదు అయింది. ఈ దాడిలో తప్పించుకున్న రాజు అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ మేం వీధిలో కూర్చున్నాం. మూడు బైకులపై ఆరుగురు వచ్చారు. వీరిలో సూరి, విజయ్, రాజు అనే ముగ్గురు గొడ్డలి, తుపాకితో దాడి చేయగా తాను ఇంటిలోకి పారిపోయినట్లు తెలిపారు. కరుణరాజ్ కి తలపై గొడ్డలితో దాడి చేయడంతో అక్కడిక్కడే కుప్పకూలి పోయాడు. హరి అతనిపై కూడా దాడి చేయగా భుజంపై గొడ్డలి వేటు పడింది. అక్కడ నుంచి పారిపోవడంతో ప్రాణాలు నిలిచాయని, తాను కూడా ఇంటిలోకి వెళ్లి తలుపు వేయడంతో తాను ప్రాణాలతో తప్పించుకున్నానని రాజు మీడియాకు తెలిపారు. మృతుడు తల్లి మాట్లాడుతూ నా కొడుకును చంపిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. పాత కక్షలతో ఈ విధంగా చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ మహేంద్ర పాత్ర తెలిపారు.
బైక్ కాల్చేశారని ఫిర్యాదు
'వాళ్లు పది మంది బ్యాచ్, వాళ్లు గంజాయి కూడా తాగుతారు. గతంలో నా బైక్ కాల్చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఎవరిపై అనుమానం ఉందని అంటే పది మంది పేర్లు ఇచ్చాను. అప్పటి నుంచి మాపై కక్ష పెంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సమయంలో నైట్ బైక్ లపై తిరుగుతున్నారు. ఇలా చేయడం సరికాదని చెప్పాం. ఇవాళ మేం ఇంటి బయట కూర్చున్నాం. మూడు బైక్ లపై వచ్చిన ఆరుగురు గొడ్డలితో మాపై దాడికి దిగారు. నేను, హరి పారిపోయాం. కరుణరాజ్ తలపై గొడ్డలితో కొట్టడంతో అక్కడే పడిపోయాడు. ఒకడు తుపాకీతో నా వెంట పడ్డాడు. నేను పారిపోయి మేడ మీదకు వెళ్లిపోయాను. హరిపై కూడా గొడ్డలితో దాడి చేశారు. వీళ్లంతా పక్క సెంటర్ గంజాయి, మందు తాగుతూ అర్థరాత్రుళ్లు హల్ చల్ చేస్తారు. గంజాయి తాగడం, జిమ్ కు వెళ్లడం మాత్రమే చేస్తారు." - రాజు, బాధితుడు
మూడు టీమ్ లతో గాలింపు
ఈ దాడికి పాత కక్షలే కారణమని పోలీసులు అంటున్నారు. మూడు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. గతంలోని వీరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం ఉందన్నారు.