Srikakulam News : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్జీఆర్ పురం సముద్ర తీరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు గల్లంతయ్యారు. స్నానానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తుల్లో గణేష్(40) మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరి ఆచూకీ ఇంకా తెలియలేదు. వీరు విశాఖపట్నం ఉప్పాడ గ్రామానికి చెందిన వారని బంధువులు తెలిపారు. రామచంద్రపురం గ్రామంలో బంధువులు ఇంటికి వచ్చారని గ్రామస్తులు తెలిపారు.
ప్రకాశం జిల్లాలో విషాదం
ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో స్నానానికి దిగిన నలుగురు చిన్నారులు చనిపోయారు. ఈ ఘటన జరుగుమిల్లి మండలం అక్కచెరువు పాలెంలో శనివారం సాయంత్రం జరిగింది. మొత్తం ఆరుగురు పిల్లలు చెరువులో గల్లంతు అయినట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు బాలికలను స్థానికులు రక్షించారు. వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగతా నలుగురి మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీశారు. మృతులు కౌశిక్(16), సుభాష్(11), సుబ్రహ్మణ్యం (15), హరి భగవన్నారాయణ(10)గా పోలీసులు గుర్తించారు. ఒకే గ్రామంలో నలుగురు చిన్నారులు మృతి చెందడంతో అక్కచెరువుపాలెంలో విషాదం నెలకొంది. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పరామర్శించారు.