Srikakulam News : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉన్నతాధికారుల పేర్లతో మోసాల వల విసురుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పేరుతో డబ్బుల వసూళ్లకు సైబర్ నేరగాళ్లు యత్నించిన వైనం సంచలనం రేకెత్తిస్తుంది. కలెక్టర్స్ శ్రీకాకుళం పేరుతో ఫేస్ బుక్ లో ఐడీ క్రియేట్ చేశారు కేటుగాళ్లు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పోలీయో చుక్కలు వేస్తున్న ఫొటోను ప్రొఫెల్ గా సెట్ చేశారు. ఫేస్ బుక్ లో పలువురికి మెసేజ్ లు పెట్టారు.  ఎలా ఉన్నారు అని విచారిస్తూ గూగుల్ పే వాడుతున్నారా....నీడ్ 10,000, అర్జంట్ ట్రాన్సఫర్, ఉదయం తిరిగి ఇచ్చేస్తా అనే అర్థంతో ఇంగ్లీషులో మెసేజ్ లు చేశారు. ఈ మెసేజ్ లు స్థానికంగా వైరల్ అయ్యాయి. కలెక్టర్స్ శ్రీకాకుళం పేరుతో ఉన్న ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా డబ్బులు అడగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 


కలెక్టర్ పేరుతో నకిలీ ఖాతా 


రాష్ట్రంలోని కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉన్నతాధికారుల పేరుతో  డబ్బులు వసూళ్లు చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించిన విషయం అందరికి తెలిసిందే. దీంతో ఇది కూడా సైబర్ నేరగాళ్ల పనే అని భావించారు అధికారులు. అయితే కలెక్టర్స్ శ్రీకాకుళం ఫేస్ బుక్ అకౌంట్ ఉండడంతో కొందరు స్థానికులు కూడా ఫ్రెండ్స్ జాబితాలో చేరారు. రూ 10000లు ట్రాన్స్ ఫర్ చేయమని పోస్టింగ్ వచ్చినప్పుడే ఇది ఫేక్ అన్న సందేహం వ్యక్తమైంది. అయితే ఇది ఎవరో తెలిసిన వారు చేసిన పనే అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఇటువంటి ఫేక్ ఐడీలు సృష్టించి మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లపై దృష్టిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


అసలేం జరిగింది?  


ఒకరి పేరుతో మరొకరు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేయడం, వాటితో వారి ఫ్రెండ్ లిస్ట్ లోని పలువురి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతున్నారు కేటుగాళ్లు. సెలబ్రిటీలు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రముఖుల పేరిట ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి రిక్వెస్ట్ పెడుతున్నారు. ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వారికి మెసెంజర్ లో మెసేజ్ పెడుతుంటారు. మెసెంజర్ లో కొద్దిసేపు చాట్ చేశాక ఆపదలో ఉన్నామని, అత్యవసరంగా డబ్బులు కావాలని, మరుసటి రోజు తెల్లవారికే అందజేస్తామని మెసేజ్ పెడుతుంటారు. అవతల వ్యక్తి ఎంత పెద్దవారైనా దూర ప్రాంతంలో ఉండడం మూలంగా అత్యవసరంగా వారికి డబ్బులు అవసరమని భావిస్తూ ఉంటాం. మెసెంజర్లో నకిలీ ఖాతాదారుడు, సైబర్ కేటుగాడు ఓ నెంబర్ పంపిస్తాడు. ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు కూడా.  ఇలా మోసం చేస్తున్న గ్యాంగ్ జిల్లా కలెక్టర్ పేరున ఓ ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేసింది. 


ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ 


శుక్రవారం ఉదయం నుంచి పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు నాయకులు, వివిధ రంగాల ప్రముఖులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు ఇప్పటికే ఓ ఫేస్ బుక్ అకౌంట్ ఉంది. దీనితో ఆయనే రిక్వెస్ట్ పెట్టి ఉంటారని, ఆ రిక్వెస్ట్ ను అంగీకరించారు చాలా మంది. వెంటనే ఆన్లైన్ మోసగాడు ఎక్కడ ఉన్నారంటూ మెసేజ్ లు చేశాడు.  కొందరు శ్రీకాకుళంలో అని, మరికొందరు ఊరిలో అని ఇచ్చారు. ఆ తర్వాత అత్యవసరంగా డబ్బులు కావాలని, మరుసటి రోజు ఇస్తామని మెసెంజర్ లో సందేశం ఇచ్చాడు. అత్యవసరంగా డబ్బులు కావాలని అడుగుతూ తన ఫోన్ నెంబర్ 88394 45920కు ఫోన్ పే చేయాలని సందేశం పంపాడు. జిల్లా కలెక్టరే స్వయంగా డబ్బులు అడగడంపై అనుమానం వచ్చిన కొందరు ఫేక్ అకౌంట్ అని గుర్తించారు. ఈ విషయాన్నికలెక్టరేట్ సిబ్బందికి తెలిపారు. కలెక్టర్ కు విషయం తెలిసి తన పేరిట డబ్బులు అడిగితే ఇవ్వవద్దని ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టారు.