Son Killed His Mother In Vikarabad: రోజూ మద్యం తాగి వస్తోన్న కొడుకుని చూసి తాగొద్దని మందలించినందుకు ఆ తల్లిపై ఓ కసాయి కొడుకు కర్కశంగా ప్రవర్తించాడు. ఆవేశంతో కాలితో తన్నగా ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లాలో (Vikarabad District) చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్‌లో శంకరమ్మ కుటుంబం జీవనం సాగిస్తోంది. కుటుంబాన్ని పోషించాల్సిన ఆమె కొడుకు రోజూ మద్యం తాగి వచ్చేవాడు. దీనిపై ఆమె తరచూ కుమారున్ని మందలించేది. బుధవారం రాత్రి కూడా తాగి వచ్చిన కొడుకును ప్రశ్నించగా.. మద్యం మత్తులో ఆవేశంతో కసాయి కొడుకు ఆమెను కాలితో తన్నాడు. దీంతో ఆమె రోడ్డుపై కుప్పకూలింది. అయినా కూడా శంకరమ్మపై కర్కశంగా ప్రవర్తించడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొడుకు అక్కడి నుంచి పరారయ్యాడు.


అనంతరం స్థానికులు శంకరమ్మను తట్టిలేపినా లేవలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కొడుకు కోసం గాలిస్తున్నారు. శంకరమ్మను కొడుకు బలంగా తన్నడంతో ఆమె చనిపోయినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు.


Also Read: Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు