Son Kidnapped Mother: రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. కేవలం ఆర్థిక సంబంధాలే నిలుస్తున్నాయి. ఆస్తి కోసం ఏదీ లెక్క చేయడం లేదు. కన్న తల్లిని, తండ్రిని కూడా చిత్ర వధకు గురి చేస్తున్నారు. తోడ బుట్టిన వారిని చంపడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఓ ఘటన మానవత్వానికి మచ్చలా నిలుస్తోంది. 


గతంలో దాడులు.. ఇప్పుడేమో కిడ్నాప్ లు!


నెల్లూరు జిల్లా కావలి పట్టణం గాయత్రి నగర్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సీఐఎస్ఎఫ్ ఏఎస్సైగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన కోటేశ్వరరావు ఆస్తి కోసం కన్న తల్లిని కిడ్నాప్ చేశాడు. విశ్రాంతి ఏఎస్సై చేసిన ఘనకార్యం ఇదే మొదటిది కాదు. అంతకు ముందు కూడా ఆయన ఇలాగే ప్రవర్తించాడు. ఆస్తి కోసం పలు మార్లు కన్న తల్లినే తీవ్రంగా కొట్టిన చరిత్ర కోటేశ్వర రావుది. కోటేశ్వర రావు తల్లి పేరు మహా లక్ష్మమ్మ. ఆమె వయస్సు 85 ఏళ్లు. గతంలో కోటేశ్వర రావు ఆస్తి కోసం తల్లి మహా లక్ష్మమ్మపై దాడికి పాల్పడ్డాడు. కన్న తల్లి అని కూడా చూడకుండా, వృద్ధురాలు అనే దయ లేకుండా నీచంగా ప్రవర్తించాడు. తీవ్రంగా కొట్టడంతో ఆమె తన కూతురు వద్దకు వచ్చి తల దాచుకుంటోంది. 


కూతురు పేరు మీద రాస్తుందేమోనన్న భయంతోనే..!


పెద్ద కుమార్తె మహేశ్వరి వద్ద ఉంటోంది మహా లక్ష్మమ్మ. మహా లక్ష్మి పేరు మీద ఉన్న ఆస్తిని కూతురు పేరు మీద ఎక్కడ రాస్తుందోనన్న భయంతో దారుణాలకు ఒడిగట్టాడు ఈ రిటైర్డ్ ఏఎల్లై కోటేశ్వర రావు. రెండు నెలల క్రితం కన్న తల్లి మీదే కోటేశ్వరరావు దాడికి యత్నించాడు. తాజాగా  కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా మహేశ్వరి ఇంటి మీద దాడి చేసి మహా లక్షమ్మని కిడ్నాప్ చేశారు.


అడ్డొచ్చిన వాళ్లను కొడ్తూ..!


అడ్డు వచ్చిన మహేశ్వరి మరియు మహేశ్వరి భర్తపై విచక్షణా రహితంగా దాడి చేశారు కోటేశ్వర రావు కుటుంబ సభ్యులు. మహాలక్షమ్మను తీసుకెళ్లారు. ఈ కిడ్నాప్ కు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహేశ్వరి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.


మొన్నటికిమొన్న ఆస్తి కోసం మనవడి అరాచకం..!


రెండ్రోజుల క్రితం ఆస్తి తగాదాల వల్ల తాత అంత్యక్రియలు నిర్వహించబోనని అన్నాడు శ్రీసత్యసాయ జిల్లాలో ఓ వ్యక్తి. చివరాఖరికి పోలీసులు కలుగ జేసుకుని చెప్పడంతో అంత్యక్రియలను మమ అనిపించాడు. అసలేం జరిగిందంటే.. చిన్న హనుమయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు గంగమ్మ, రెండో భార్య లక్ష్మమ్మ. గంగమ్మకు ఒక కొడుకు రామాంజినప్ప కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. లక్ష్మమ్మకు ఒక కూతురు ఉంది. రామాంజినప్ప కొడుకు నాగ భూషణం, కూతురు కల్యాణి ఉన్నారు. హనుమయ్య రెండో భార్య లక్ష్మమ్మ కూతురు పేరు యల్లమ్మ. ఐదు నెలల క్రితం లక్ష్మమ్మ చనిపోయింది. అయితే యల్లమ్మకు తాత హనుమయ్య  ఎకరా పొలం రాసి ఇచ్చాడు. కానీ పెద్ద భార్య గంగమ్మ కుమారుడికి, మనవలకు ఆస్తి ఇవ్వలేదు. ఆ కోపం నాగ భూషణంలో ఉండేది. తాత చనిపోగా.. ఆస్తి రాసివ్వలేదని అంత్యక్రియలు చేయనని చెప్పి వెళ్లిపోయాడు.