జగిత్యాల జిల్లాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి కేసును పోలీసులు ఛేదించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. చివరకు హంతకులు దీప్తి చెల్లి, ఆమె ప్రియుడే హంతకుడని తేల్చారు. 


దీప్తి సోదరి చందన, ఆమె ప్రియుడిని వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రాంతంలో విచారించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. 


మొదటి నుంచి ఈ కేసులో సోదరిపైనే అనుమానం ఉండేది. అయితే హత్య జరిగిన రెండోరోజు తమ్ముడికి ఫోన్ చేసిన చందన... తనకు ఎలాంటి పాపం తెలియదని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో అసలు హంతకుడు ఎవరు అనే సస్పెన్షన్ కొనసాగింది. చివరకు పోలీసులు తమ స్టైల్‌లో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 


సరిగ్గా అక్క చనిపోయిన రోజే సోదరి కనిపించకపోవడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగించారు. తెల్లవారుజామున బస్టాండులో ప్రియుడితో కనిపించడం సైతం అనుమానాలను బలపరిచింది. చివరకు అదే నిజమైంది. 


పోలీసుల విచారణలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో బీటెక్ చదివిన చందన... తన కాలేజీలో సీనియర్‌ వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకుందామని అనుకుంది. విషయాన్ని అక్క అయిన దీప్తికి చెప్పింది. 


చెల్లి చందన ప్రేమ సంగతి తెలుసుకున్న అక్క దీప్తి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆ వ్యక్తి వేరే మతస్తుడు కావడంతో కుటుంబ సభ్యులు చందన ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. విషయంపై చర్చలు నడుస్తుండగానే వేరే బంధువులు ఇంటికి వెళ్లారు వాళ్ల పేరెంట్స్. 


ఇంట్లో దీప్తి, చందన మాత్రమే ఉన్నారు. తన ప్రేమ పెళ్లికి అక్క దీప్తియే అడ్డంకిగా ఉందని మెయిన్ విలన్ అవుతుందని భావించింది చందన. అక్క అడ్డుతొలగించుకునేందుకు డిసైడ్ అయింది. లిక్కర్ తెచ్చుకోవడానికి అని చెప్పి వెళ్లి చందన.. తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఇలా వచ్చిన వాళ్లిద్దరు దీప్తిని చంపేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయినట్టు పోలీసులు చెబుతున్నారు. 


చందన, ఆమెప్రియుడు దీప్తిని చంపడంలో, అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడంలో కొందరి బంధువులు, డ్రైవర్ పాత్ర ఉన్నట్టు పోలీసులు తేల్చారు. వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. 


జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బంక దీప్తి నాలుగు రోజుల కిందట తన ఇంట్లో చనిపోయి ఉంది. ఏపీకి చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు 25 ఏళ్ల కిందటే కోరుట్లకు వచ్చి భీముని దుబ్బలో స్థిరపడ్డారు. శ్రీనివాస్ రెడ్డి ఇటుక బట్టీ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతలుకు ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు 24 ఏళ్ల దీప్తి సాఫ్ట్ వేర్ ఇంజినీర్. కాగా, కోరుట్లలోనే ఉంటూ ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తుంది. రెండో కూతురు చందన బీటెక్ పూర్తి చేసింది. ఇంటి వద్దే ఉండగా, కుమారుడు బెంగళూరులో డిగ్రీ చదవుతున్నాడు.


శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు సోమవారం రోజు ఉదయం హైదరాబాద్ లోని బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లారు. కుమారుడు బెంగళూరులో చదువుకుంటుండగా.. ఇంట్లో అక్కాచెల్లెళ్లు దీప్తి, చందన మాత్రమే ఉన్నారు. ఆరోజు రాత్రి 10 గంటల వరకు అక్కాచెల్లెళ్లతో తల్లిదండ్రులు ఫోన్ లో మాట్లాడారు. ఆలస్యమైందని, మరుసటి రోజు వస్తామని తల్లిదండ్రులు చెబితే దీప్తి, చందన సరే అన్నారు.  
మరుసటి రోజు ( మంగళవారం) ఉదయం ఓ కూతురి నెంబర్ కు శ్రీనివాస్ రెడ్డి కాల్ చేశాడు. ఆమె లిఫ్ట్ చేయడం లేదని మరో కూతురు నెంబర్ కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో వారికి అనుమానం కలిగింది. పెద్ద కూతురు దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చిన్న కూతురు చందన ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి ఇంట్లో చూడాలని అడిగారు. మధ్యాహ్నం ఓ మహిళ వెళ్లి చూడగా తలుపు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉంది, లోపలికి వెళ్లి చూడగా చిన్న కూతురు చందన కనిపించలేదు. పెద్ద కూతురు దీప్తి సోఫాలో కనిపించింది. భయంతో స్థానికులను పిలవగా వాళ్లు వచ్చి చూసి దీప్తి అప్పటికే చనిపోయి ఉందని నిర్ధారించుకున్నారు. పోలీసులతో పాటు  వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.


మెట్ పల్లి డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి, సీఐ లక్ష్మీ నారాయణ, ఎస్సై కిరణ్ కుమార్, చిరంజీవి అక్కడికి వెళ్లి పరిశీలించారు. వంట గదిలో వోడ్కా, బ్రీజర్, వెనిగర్, నిమ్మకాయలు, స్నాక్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి అక్కాచెల్లెళ్లు మద్యం సేవించారని అనుకున్నారు. కానీ తెల్లవారుజామున అక్క సోఫాలో చనిపోయి కనిపించగా, చెల్లెలు ఓ యువకుడితో నిజామాబాద్ వెళ్లే బస్సు ఎక్కినట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది. 


తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తాను అక్కను చంపలేదంటూ సోదరుడు సాయికి రెండో అక్క చందన వాయిస్ మెస్సేజ్ చేసినట్లు సర్క్యూలేట్ అయింది. మరోవైపు దీప్తి శరీరంపై గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. దాంతో ఆమెపై దాడి చేసి హత్య చేసింది ఎవరు, ఆమె చెల్లెలు చందన అదే సమయంలో ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు చంపింది ఎవరో కాదు సొంత చెల్లి, ఆమె ప్రియుడే ఈ ఘోరానికి పాల్పడినట్టు తేల్చారు పోలీసులు.